నిరుపయోగంగా ఉన్న 43 విమానాశ్రయాల్లో ఏడాదిలోగా కార్యకలాపాలు ప్రారంభిస్తామని పౌర విమానయాన శాఖ ప్రకటించింది.
పణజి: దేశవ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్న 43 విమానాశ్రయాల్లో ఏడాదిలోగా కార్యకలాపాలు ప్రారంభిస్తామని పౌర విమానయాన శాఖ ప్రకటించింది. మారుమూల ప్రాంతాలకు విమానయాన సేవలు కల్పించడమే ధ్యేయంగా ఈ ప్రక్రియ చేపట్టబోతున్నట్లు తెలిపింది. వాణిజ్య సేవలకు అనుగుణంగా ఈ విమానాశ్రయాలను తీర్చిదిద్దడానికి ఇప్పటికే 11 బిడ్లను స్వీకరించినట్లు పౌర విమానయాన కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే చెప్పారు. విమానయాన రంగం ఆదాయం పెంచడానికి సహాయపడేలా దేశీయంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌పై మూడురోజుల వర్క్‌షాప్‌ను ప్రారంభించిన తరువాత ఆయన ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు.
ప్రస్తుతమున్న 72 విమానాశ్రయాలకు ఈ 43 కూడా తోడైతే భారత విమానరంగ గమనమే మారుతుందని అన్నారు. పునరుద్ధరణ చేపట్టబోతున్న ఈ విమానాశ్రయాలను దేశవ్యాప్తంగా సమానంగా కేటాయించామని, వాటిలో పది దక్షిణ భారతదేశంలో ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఇంధన ధరల పతనంతో పాటు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చేపట్టిన పలు చర్యల వల్ల విమాన ప్రయాణ చార్జీలు 30 శాతం దాకా తగ్గాయని తెలిపారు.