జీడీపీ అంచనాల్లో చాలా తప్పులున్నాయ్!
జీడీపీ అంచనాల్లో చాలా తప్పులున్నాయ్!
Published Sat, Jan 7 2017 4:25 PM | Last Updated on Thu, Jul 11 2019 7:48 PM
న్యూఢిల్లీ : భారత ప్రస్తుత ఆర్థికసంవత్సర వృద్ధి రేటు పడిపోతుందంటూ కేంద్ర గణాంకాల సంస్థ వెల్లడించిన అంచనాల్లో చాలా లోపాలున్నాయట. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన పరిణామాలను డేటాలో ప్రభుత్వం కలుపకపోవడంతో ప్రధాన లోపంగా దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఐక్రా ఎత్తిచూపింది. 2016-17లో దేశ వృద్ధి రేటు 6.8 శాతానికి పడిపోతుందని ఈ ఏజెన్సీ శుక్రవారం అంచనావేసింది. 2016 నవంబర్ నెల మధ్య నుంచి పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రారంభమైంది. కానీ వీటిని పరిగణనలోకి తీసుకోకుండా అక్టోబర్ వరకున్న డేటాతోనే ప్రభుత్వం వృద్ధి అంచనాలు ప్రవేశపెట్టింది.
ముందటి సంవత్సరాలకంటే ప్రస్తుత అంచనాల్లో చాలా తప్పులున్నాయని, నగదుతో ముడిపడి ఉన్న కన్స్ట్రక్షన్ సెక్టార్ లాంటి వాటిలో తప్పులు దొర్లిన్నట్టు ఐక్రా ఓ ప్రకటనలో తెలిపింది. 2017లో వృద్ధిపై సీఎస్ఓ ప్రకటించిన ముందస్తు అంచనాల్లో ఎలాంటి ఆశ్చర్యకరమైన విషయం లేదని, వారు ఎక్కువగా అందుబాటులో ఉన్న ప్రథమార్థ డేటానే పరిగణలోకి తీసుకున్నట్టు ఐక్రా చెప్పింది. కానీ తయారీరంగం, వ్యవసాయం, విద్యుత్, నిర్మాణ వంటి సబ్-సెక్టార్లలో ప్రభుత్వం విడుదల చేసిన ముందస్తు అంచనాల కంటే ఇంకా ఎక్కువగానే వృద్ధి రేటు పడిపోతుందని ఐక్రా వివరించింది. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన కార్పొరేట్ కంపెనీల మూడో క్వార్టర్ ఫలితాలు ఇంకా విడుదల కాకపోవడం, రబీ ఉత్పత్తిపై ముందస్తు అంచనాలు కూడా గణాంకాల కచ్చితత్వంపై ప్రశ్నార్థకంగా మారినట్టు ఐక్రా తన ప్రకటనలో తెలిపింది.
Advertisement
Advertisement