ఆ మావోయిస్టులలో 70% మహిళలే!
ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో దాడిచేసి, 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న మావోయిస్టులలో.. 70 శాతం మంది మహిళలే ఉన్నారట. భారీ స్థాయిలో ఏకే-47, ఇన్సాస్ రైఫిళ్లలాంటి అత్యాధునిక ఆయుధాలతో కూడిన 300-400 మంది వరకు మావోయిస్టులు సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దక్షిణ బస్తర్ ప్రాంతంలోని కాలాపత్తర్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఈ భీకర దాడి మొదలైంది. గిరిజన ప్రాంతాలకు రవాణా సదుపాయం కల్పించేందుకు రోడ్లు వేస్తున్న బృందానికి రక్షణగా వచ్చిన సీఆర్పీఎఫ్ 74వ బెటాలియన్‌లో 25 మంది మావోయిస్టుల ఘాతుకానికి బలైపోయారు.
మావోయిస్టులకు అనుకూలం
చింతగుఫ - బుర్కపాల్ - భేజి ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి పట్టుంది. ఇక్కడ గతంలోనూ చాలా దాడులు జరిగి, పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. భౌగోళికంగా ఆ ప్రాంతం మావోయిస్టులకు అనుకూలంగా ఉంటుంది. రోడ్డు వేస్తున్న ప్రాంతం కొంత దిగువన ఉండటం.. ఎగువన గుట్టలు ఉండటంతో పైనుంచి దాడి చేసేవారికి ఆ గుట్టలు రక్షణగా ఉంటాయి. కింద ఉన్నవాళ్లు సులభంగా టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్నివైపుల నుంచి కమ్ముకున్న మావోయిస్టులు హేండ్ గ్రనేడ్లు, ఆటోమేటిక్ రైఫిళ్లు, రాకెట్ లాంచర్లతో దాడులు చేసినట్లు తెలిసింది.
నల్ల యూనిఫాంలు, అత్యాధునిక ఆయుధాలు
ముందుగా తాము ఎంతమంది ఉన్నామో తెలుసుకోడానికి గ్రామస్తులను పంపారని, తర్వాత వచ్చినవారిలో ఎక్కువ మంది మహిళా మావోయిస్టులే ఉన్నారని వాళ్లంతా నల్లటి యూనిఫాంలు ధరించి ఏకే సిరీస్, అసాల్ట్ రైఫిళ్ల లాంటి అత్యాధునిక ఆయుధాలు తీసుకొచ్చారని గాయపడిన సీఆర్పీఎఫ్ జవాను ఒకరు చెప్పారు. ఇంతకుముందు సుక్మాకు పొరుగునే ఉన్న దంతేవాడ జిల్లాలో 2010 ఏప్రిల్ 96వ తేదీన జరిగిన దారుణమైన దాడిలో 75 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఒక ఛత్తీస్‌గఢ్ పోలీసు మరణించారు.