ముంబై - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్, ఎదురుగా వస్తున్న వోల్వో బస్సును ఢీ కొట్టింది. దాంతో వోల్వో బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో ఎనిమిది మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 14 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మంగళవారం అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో జరిగింది. బీపీసీఎల్ ట్యాంకర్ గుజరాత్ లోని హజారియా ప్రాంతానికి వెళ్తోంది. ఈ రెండు వాహనాలు ఢీకొనడంతో రెండింటికీ మంటలు అంటుకున్నాయి. అయితే మృతులు మాత్రం అంతా బస్సులోని వారేనని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి మసిబొగ్గులుగా మారిపోవడంతో గుర్తుపట్టడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. అయినా వాటిని పోస్టుమార్టం కోసం పంపారు.
అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసుకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత సంవత్సరం మే 29వ తేదీన కూడా ఇలాంటి ప్రమాదమే ఒకటి సంభవించింది. ఆ ప్రమాదంలో 14 మంది మరణించగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.