భారీ పేలుడు.. 90 మంది బలి | 90 people in a massive blast in died | Sakshi
Sakshi News home page

భారీ పేలుడు.. 90 మంది బలి

Published Sun, Sep 13 2015 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

భారీ పేలుడు.. 90 మంది బలి

భారీ పేలుడు.. 90 మంది బలి

మధ్యప్రదేశ్‌లో ఘోర దుర్ఘటన.. 100 మందికి పైగా గాయాలు..
బావి తవ్వకాల కోసం ఇంట్లో నిల్వ చేసిన పేలుడు పదార్థాలు
విస్ఫోటనంతో జనసమ్మర్ద ప్రాంతంలో కుప్పకూలిన 2 భవనాలు
మృతుల్లో అత్యధికులు కూలి పని కోసం నిరీక్షిస్తున్న కూలీలే

 
ఝబువా (మధ్యప్రదేశ్): బావుల తవ్వకాల కోసం భారీ స్థాయిలో నిల్వ చేసిన పేలుడు పదార్థాలు పేలిపోవటంతో మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా పెట్లావద్ పట్టణంలో 90 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో చాలా మంది కూలి పని కోసం నిరీక్షిస్తున్న కూలీలే. రాతి ప్రాంతాల్లో బావులు తవ్వేందుకు లెసైన్స్ కలిగివున్న రాజేంద్ర కసావా అనే వ్యక్తి తన నివాస భవనంలో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్‌లను నిల్వ ఉంచాడు. రెండు దుకాణాలు కూడా ఉన్న ఈ రెండంతస్తుల భవనం పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద రద్దీ ప్రాంతంలో ఉంది. దీనికి ఆనుకుని చాలా రద్దీగా ఉండే మూడంతస్తుల సెథియా రెస్టారెంట్ కూడా ఉంది. శనివారం ఉదయం 8:30 గంటలకు రాజేంద్ర భవనంలో పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో ఆ భవనం కుప్పకూలింది. దానికి ఆనుకుని ఉన్న రెస్టారెంట్ కూడా ధ్వంసమయింది. ఆ సమయంలో రెస్టారెంట్‌లో పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్నారని, సమీపంలో రోజు కూలీలు కూడా చాలా మంది కూర్చుని ఉన్నారని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం 90 మంది మృతిచెందగా వారిలో ఎక్కువ మంది రెస్టారెంట్ సమీపంలో కూలిపని కోసం నిరీక్షిస్తున్న రోజు కూలీలేనని అధికారులు తెలిపారు. అలాగే.. గుజరాత్ వెళ్లేందుకు ప్రయాణమై రెస్టారెంట్ వద్ద టీ, టిఫిన్లు చేయటానికి నిలుచుని వున్న మరికొందరు కూడా ప్రాణాలు కోల్పోయారు.

 మొదట టపాసుల పేలుళ్ల చప్పుళ్లు...
 ‘కింది అంతస్తులో రెండు దుకాణాలు కూడా ఉన్న ఆ భవనం నుంచి మొదట టపాసులు పేలిన చప్పుళ్లు వినవచ్చాయి. తర్వాత ఎవరో ఒక షాపు షట్టరు తెరిచారు. దీంతో భారీ విస్ఫోటనం సంభవించింది. జనం ప్రాణాలు దక్కించుకోవటానికి పరుగులు తీశారు. అలా పారిపోయిన వారే ప్రాణాలతో బయటపడ్డారు. వారికి కూడా గాయాలయ్యాయి’’ అని బలరామ్ అనే కూలి తెలిపారు. ఆయన కూడా ఈ పేలుడులో గాయపడ్డారు. విస్ఫోటనంతో మనుషులు ముక్కలు చెక్కలయ్యారని.. శరీర భాగాలు ముక్కలుగా తెగి గాలిలోకి ఎగిరిపడటం చూశామని ఈ పేలుడు నుంచి గాయాలతో బయటపడ్డ నర్సింగ్ (42) అనే వ్యక్తి తెలిపాడు. ధ్వంసమైన రెండు భవనాల శిథిలాల్లో చాలా మంది చిక్కుకుపోయారని పేర్కొన్నాడు.

 మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు
 జిల్లా పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అంతర్‌సింగ్ ఆర్యలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ఝబువా జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టమ్ నిర్వహిస్తున్నారు. క్షతగాత్రులకు కూడా అదే ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. సహాయ చర్యల కోసం జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాన్ని పంపించారు. కుప్పకూలిన నిర్మాణాల శిథిలాలను తొలగించేందుకు గుజరాత్‌లోని వడోదర నుంచి మరొక బృందాన్ని తరలించారు. ఈ దుర్ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు రాష్ట్ర హోంమంత్రి బాబూలాల్‌గౌర్ తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించటం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.

 ప్రధాని సంతాపం... మధ్యప్రదేశ్‌లో విస్ఫోటనంలో ప్రజలు మృతి చెందటం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్‌లో తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ.. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా తీవ్ర సంతాపం తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement