పాతనోట్లపై దళారుల బంపర్ ఆఫర్!
- లక్షకు అరవైవేల చొప్పున డీల్
- రియల్ ఎస్టేట్‌లో మళ్లుతున్న నల్లధనం
మీ దగ్గర నల్లధనం పెద్దఎత్తున ఉందా? పాత నోట్లయిన రూ. 500, వెయ్యినోట్లను పెట్టుబడులరూపంలో మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో బంపర్ ఆఫర్. 60:40 నిష్పత్తిలో మీరు లక్షరూపాయలు పాత నోట్లు ఇస్తే.. రూ. 60వేలుగా పరిగణించి.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో పెట్టుబడులుగా మళ్లిస్తాం.. ఇది లక్నోకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు రియల్ ఎస్టేట్ ఏజెంట్ల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్ సారాంశం ఇది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్, లక్నో, ఘజియాబాద్, నోయిడా తదితర నగర వాసులకు ఇలాంటి ఆఫర్లు పోటెత్తుతున్నాయి. 30శాతం నుంచి 50శాతం కమిషన్‌తో మీ దగ్గరున్న బ్లాక్‌మనీని వైట్ చేస్తామని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వ్యాపారులను ఊరిస్తున్నారు. అంతేకాదు బ్లాక్‌మనీ ఉన్న పెద్దలు కూడా ఇలాంటి ఆఫర్లతో తమను ఆశ్రయిస్తున్నారని, తమ బ్లాక్‌మనీని పెట్టుబడులుగా మళ్లించాలని కోరుతున్నారని ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ తెలిపారు. తనకు 60:40 ఆఫర్ అందిందని సాఫ్‌వేర్ ఉద్యోగి మనీష్ గుప్తా మీడియాకు తెలిపారు.
పెద్దనోట్ల రద్దుతో దేశమంతటా రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద కుదుపు ఎదురైంది. చిన్న చిన్న ప్రాజెక్టులు చేపట్టిన రియల్ వ్యాపారులు భయాందోళనకు లోనయ్యారు. అయితే, పెద్దనోట్ల రద్దుతో ఎదురైన చిక్కులను ఎదుర్కొనేందుకు రియల్ ఏజెంట్లు లొసుగులను అస్త్రంగా చేసుకుంటున్నారు. 100-150కిపైగా బ్యాంకు ఖాతాల నెట్‌వర్క్‌తో రియల్ ఏజెంట్లు తమకు బ్లాక్‌మనీ రూపంలో అందే పెట్టుబడులను వైట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, రియల్ ఏజెంట్లు గుట్టుగా నిర్వహిస్తున్న చైన్ నెట్‌వర్క్ ఖాతాలు బట్టబయలు అయితే, పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోకతప్పదని చార్టెట్ అకౌంటెంట్లు హెచ్చరిస్తున్నారు.