
ఫేస్‌బుక్ కీచకుడు
అమ్మాయిల పేర్లతో నకిలీ ఖాతాలు
సాక్షి, హైదరాబాద్: అమ్మాయిల పేర్లతో ఫేస్‌బుక్ రిక్వెస్ట్, అమ్మాయే కదా అని యాక్సెప్ట్ చేస్తే మెల్లమెల్లగా స్నేహం, వ్యక్తిగత విషయాలు సేకరించి బెదిరింపులు.. నగ్నచిత్రాలు, వీడియోలు పంపాలంటూ డిమాండ్లు.. అవి పంపాక డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిలింగ్... హైదరాబాద్‌లో టీనేజీ అమ్మాయిలపై ఓ మోసగాడు వేసే వల ఇది. ఫేస్‌బుక్ అడ్డాగా 80 మందికిపైగా అమ్మాయిలను మోసం చేశాడు. చివరికి ఓ విద్యార్థిని ఫిర్యాదుతో పోలీసులకు దొరికిపోయాడు.
హైదరాబాద్‌లో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఓ మురికివాడలో ఉండే మజీద్ అనే యువకుడి బాగోతం ఇది. బంజారాహిల్స్‌కు చెందిన జనని అనే విద్యార్థిని, ఆమె తల్లి శ్వేతప్రభు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... వారు మజీ ద్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విలేకరులకు వెల్లడించారు.
ఏడాదిన్నరగా..
మజీద్ దాదాపు ఏడాదిన్నర కింద అమ్మాయిల పేర్లతో ఐదారు ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచాడు. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న సంపన్న వర్గాలకు చెందిన అమ్మాయిల ప్రొఫైల్‌లను వెతికి పట్టుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను పంపేవాడు. ఇలా 200 మందికి రిక్వెస్టులు పంపాడు. వారు కూడా రిక్వెస్ట్ పంపింది అమ్మాయే కదాని యాక్సెప్ట్ చేసేవారు. ఆ తర్వాత మజీద్ వారితో చాటింగ్ చేస్తూ చనువు పెంచుకున్నాడు. తమ వ్యక్తిగత సమాచారం, అంతర్గత విషయాలు పంచుకునేదాకా స్నేహం పెంచుకున్నాడు. తర్వాత తనలోని అసలు కోణం బయటపెట్టాడు. ఆ అమ్మాయిల నగ్నచిత్రాలు, వీడియోలను తీసి తన మెయిల్‌కు పంపాలని... లేకపోతే తనతో చాట్ చేసిన ప్రైవేట్ విషయాలను, సీక్రెట్ చాటింగ్, మెసేజ్‌లను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.
అయినా లొంగకపోతే ఆ మెసేజ్‌లను తల్లిదండ్రులకు పంపిస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. సంపన్న కుటుంబాల్లోని పిల్లలు తల్లిదండ్రులతో కాస్త దూరంగా మెలుగుతుండడంతో వారికి చెప్పే ధైర్యం చేయలేకపోయారు. అలా 80 మందికి పైగా అమ్మాయిలు మజీద్ ట్రాప్‌లో పడ్డారు. తన మాట వినకపోతే అంతకుముందటి ఫొటోలను ఫేస్‌బుక్‌లో, పోర్న్‌సైట్లలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. కొన్ని సందర్భాల్లో అమ్మాయిలను వ్యక్తిగతంగా కలిసేవాడు. మరికొన్ని సందర్భాల్లో డబ్బులు కూడా డిమాండ్ చేసేవాడు. అయితే డబ్బులు తీసుకున్నది, లేనిది ఇంకా తెలియలేదు. కానీ ‘రూ.86 వేలు ఇచ్చాను కదా.. మళ్లీ మళ్లీ బ్లాక్‌మెయిల్ ఏంటీ’ అని మజీద్ ఫేస్‌బుక్ ఖాతాలో ఓ అమ్మాయి పెట్టిన మెసేజ్ ఉంది. దీనిపై అసలు వివరాలు పోలీసుల విచారణలో తేలే అవకాశం ఉంది.
ఇంటర్ నుంచే..
మజీద్ మలక్‌పేటలో ఒక ప్రైవేటు కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వారిది పేద కుటుం బమే. తండ్రి పాన్‌షాప్‌లకు తమలపాకులు సరఫరా చేస్తుం టాడు. తల్లి కూరగాయలు విక్రయిస్తుంటుంది. కానీ మజీద్ ఆకతాయి పనులు చేసేవాడు. ఇంటర్ చదివే సమయంలోనే ప్రేమిస్తున్నానంటూ పలువురు అమ్మాయిలను వేధించాడు. బీటెక్‌కు వచ్చాక అమ్మాయిల వెంట పడడం మరింత పెరిగింది. అమ్మాయిల పేర్లతో నకిలీ ఖాతాలతో ఇతరులు చేసిన చాటింగ్‌లను చూసి స్ఫూర్తి పొంది... తానూ అదే దారిపట్టాడు. అమ్మాయిల పేర్లతో ఫేస్‌బుక్ ఖాతాలను తెరిచి అమ్మాయిలను ట్రాప్ చేశాడు. కొన్ని సందర్భాల్లో సీనియర్ పోలీసు అధికారి కూతురినని కూడా చెప్పుకుని, బెదిరించాడు. మజీద్‌పై ఇప్పటికే ఓ వివాహితను వేధించిన కేసు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
అమ్మాయే కదాని..
‘‘వారం కింద ఓ అమ్మాయి పేరిట ఉన్న ఫేస్‌బుక్ ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అమ్మాయే కదాని యాక్సెప్ట్ చేశా. 2 గంటల తర్వాత నీ ప్రైవేట్ వ్యక్తిగత వివరాలు నా వద్ద ఉన్నాయి, నేను చెప్పినట్టు చెయ్యకపోతే అవి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేసింది. నగ్నచిత్రాలు, వీడియోలు పంపాలని డిమాండ్ చేసింది. ఓ సీనియర్ పోలీసు అధికారి కుమార్తెనంటూ బెదిరించింది. మా అమ్మకు ఈ విషయం చెప్పాను. ఆ తర్వాత మాదాపూర్ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డినంటూ ఒక ఫోన్‌కాల్ వచ్చింది. ఫేస్‌బుక్ ఖాతాలో అసభ్యకర మెసేజ్‌లు పెట్టావంటూ, చెక్ చేసేందుకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అడిగాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని అమ్మ చెప్పింది. తర్వాత సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు ఈ విషయం చెప్పాం’’
- జననీ, విద్యార్థిని
4 రోజుల్లోనే పట్టుకున్నారు
‘‘మాకు వచ్చిన బెదిరింపుపై సైబరాబాద్ సీపీకి చెప్పగానే సైబర్ క్రైమ్‌కు పంపిం చారు. సోమవారం ఫిర్యాదు చేస్తే 4 రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. అయితే ఏ తరగతి వర్గానికి చెందిన తల్లిదండ్రులైనా పిల్లలతో దగ్గరగా మెలగాలి. వాళ్ల సమస్యలను మనమే పరిష్కరిస్తామన్న నమ్మకాన్ని వారిలో కల్పించాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి..’’
- శ్వేతప్రభు, జననీ తల్లి