
నెలలో ఒక్కరోజు ‘స్వచ్ఛాంధ్ర’కు
ప్రజలకు సీఎం పిలుపు
సాక్షి, గుంటూరు/గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలూ నెలలో ఒక్కరోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ విషయంలో మహాత్మాగాంధీ ఆదర్శంగా ముందుకు సాగుదామన్నారు. జపాన్, సింగపూర్ మాదిరిగా రాష్ట్రంలోనూ చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా బాధ్యతతో వ్యవహరించి ఉద్యమంలా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.
‘స్వచ్ఛ భారత్’లో ప్రస్తుతం దేశంలో మూడోస్థానంలో ఉన్న రాష్ట్రాన్ని మొదటిస్థానంలోకి తేవాలని కోరారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని గుంటూరులో శుక్రవారం ‘స్వచ్ఛాంధ్రప్రదేశ్ మిషన్’ను సీఎం ప్రారంభించారు. ప్రతినెలా మొదటి శనివారాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌కోసం కేటాయించామని ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ సీఎం చెప్పారు.
రాజధాని నిర్మాణంలో బిల్డర్లకు భాగస్వామ్యం: సీఎం
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో రాష్ట్రంలోని భవన నిర్మాణదారులకు భాగస్వామ్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీ రియల్‌ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్(అప్రెడా) ఆధ్వర్యంలో గుంటూరులో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ప్రారంభించిన సీఎం మాట్లాడుతూ ఏపీ బిల్డర్లు ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతులు
గుంటూరు మెడికల్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబుచెప్పారు. శుక్రవారం జీజీహెచ్‌లో పలు వార్డులను సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవుట్‌సోర్సింగ్ విధానంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ఇటీవల జరిగిన సంఘటనలు బాధాకరమమన్నారు.
కాంట్రాక్టర్ల గుత్తాధిపత్యం వల్ల శానిటేషన్ పూర్తిగా దెబ్బతిందని, అన్ని ఆసుపత్రుల్లో శానిటేషన్ ప్రక్షాళన కార్యక్రమాలు ప్రారంభించామని తెలిపారు. రైతుల ఆత్మహత్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ఆత్మహత్యలు మానసిక బలహీనత అని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనాలని, ఆత్మహత్యలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.