
ఆధార్ ఇక నిరాధారం
ఆధార్ కార్డు తప్పని సరి అని కేంద్రం జారీ చేసిన ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
ఆధార్ కార్డు చూపించడం తప్పనిసరి అని వివిధ ప్రభుత్వ విభాగాలు అభ్యర్థులను తిప్పి పంపుతున్నాయని తమకు అనేక లేఖలు వచ్చాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక వివాహం కేవలం ఆధార్ కార్డు లేనందున రిజిస్టర్ కాలేదని, పలు సంఘటనల్లో ఆధార్ లేనందున ఆస్తుల రిజిస్ట్రేషన్ కాలేదని న్యాయమూర్తి బిఎస్ చౌహాన్ అధ్యక్షతన ఏర్పడిన డివిజన్ బెంచ్ పేర్కొంది.
ఆధార్ తప్పనిసరి అని చెప్పే ఆదేశాలను తక్షణమే ఉపసంహరించాలని సుప్రీం కోరింది. తాము సేకరించిన బయోమెట్రిక్ వివరాలను ఏ సంస్థకూ ఇవ్వకూడదని కూడా సుప్రీం ఆధార్ సంస్థను ఆదేశించింది.
ఆధార్ సంస్థ జనవరి 28, 2009 న ఏర్పాటైంది. ప్రతి పౌరుడికీ పన్నెండంకెల ఆధార్ సంఖ్య ను ఇవ్వాలని ఆధార్ సంకల్పించింది. కానీ సుప్రీం తాజా ఆదేశాలతో ఆధార్ నిరాధారం అయిపోయింది.