సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ప్రధాన అనుచరుడు ప్రదీప్ చౌదరికి అవినీతి నిరోధకశాఖ నోటీసులు జారీ చేసింది. తెలుగుయువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌లకు చెందిన పుల్లారావు యాదవ్, మనోజ్, సుధీర్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డిలకు కూడా సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం నోటీసులందాయి. సోమవారం ఉదయం 10.30కల్లా విచారణకు హాజరు కావాల్సిందిగా వారిని ఏసీబీ ఆదేశించింది.
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌తో పాటు వేం డ్రైవర్, పనిమనిషి, కుటుంబ సన్నిహితుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు ఏసీబీ వర్గాల సమాచారం. డబ్బులకు సంబంధించి ‘ముఖ్య’మైన వ్యక్తుల పాత్రలను కృష్ణకీర్తన్ వెల్లడించినట్టు తెలిసింది. ఆ క్రమంలో లోకేశ్ ప్రధాన అనుచరుడైన ప్రదీప్ పాత్ర వెలుగు చూడటంతో అతన్ని విచారించనున్నారు. రేవంత్ పలుమార్లు గన్‌మెన్‌ను వదిలి రహస్యంగా వెళ్లినట్లు ఏసీబీ వద్ద సమాచారముంది. ఈ నేపథ్యంలో రేవంత్ డ్రైవర్ విచారణ కీలకంగా మారింది. రేవంత్ పాత్ర, కదలికలపై అతన్ని ప్రశ్నించనున్నారు.
అజ్ఞాతంలోనే జిమ్మీబాబు
టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు ఏసీబీ నోటీసులందిన తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మీబాబు ఇప్పటికీ అజ్ఞాతం వీడటం లేదు. ప్రత్యేక బృందం 15 రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ లభించడం లేదు. డబ్బుల వ్యవహారంలో జిమ్మీదే కీలక పాత్ర అని ఏసీబీ వద్ద ప్రాథమిక సమాచారముంది. దాంతో టీడీపీలోని అతని సన్నిహితులను విచారించడంలో భాగంగానే సుధీర్, మనోజ్, పుల్లారావులకు నోటీసులిచ్చినట్టు తెలుస్తోంది.
లోకేశ్ అనుచరుడికి ఏసీబీ నోటీసులు
Published Mon, Jul 20 2015 2:07 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement