బెయిల్ కోసం కోర్టు తలుపు తట్టిన హీరో
కోల్‌కతా: యువ హీరో విక్రమ్ ఛటర్జీ ముందస్తు బెయిల్ కోసం కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు విక్రమ్ తరపు న్యాయవాది సోమవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మోడల్, నటి టీవీ హోస్ట్ సోనికా చౌహాన్ మృతి కేసులో విక్రమ్ హత్యారోపణలు ఎదుర్కొంటున్నాడు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఆమె మరణానికి కారకుడయ్యాడని అతడిపై పోలీసులు అభియోగాలు మోపారు.
ఏప్రిల్ 29న కోల్‌కతాలో బెంగాలీ హీరో విక్రమ్- సోనికా ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. తలకు గాయాలైన విక్రమ్‌ను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. మద్యం సేవించి అతడు డ్రైవింగ్ చేసినట్టు తమ దర్యాప్తులో తేలడంతో అతడిపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు అతడిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో విక్రమ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు తలుపు తట్టాడు.