ఐదు నియోజకవర్గాల్లో పది కుటుంబాలను పరామర్శించనున్న షర్మిల
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను కలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల శనివారం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. మూడు రోజుల పాటు ఆరు నియోజకవర్గాల్లో సాగనున్న ఈ పర్యటన సందర్భంగా పది కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. బెల్లంపల్లి, సిర్పూర్(టి), ఖానాపూర్, బోథ్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల పరిధిలో షర్మిల పర్యటన ఉంటుంది. వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ పర్యటనకు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు.
షర్మిల కరీంనగర్ జిల్లా పర్యటన ముగించుకుని... శనివారం మధ్యాహ్నం మంచిర్యాల మీదుగా ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తారు. తొలుత కాసిపేట మండలం దేవాపూర్‌లో మహ్మద్ జకీర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత కాగజ్‌నగర్ మండలం చింతగూడలోని కొట్రంగి ఆనందరావు కుటుంబాన్ని కలుసుకుని రాత్రికి సోమగూడెంలో బసచేస్తారు. ఆదివారం ఉదయం వేమనపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి వెళ్లి గండ్ర పెద్ద రామారావు కుటుంబాన్ని, తర్వాత జన్నారం మండలం పొన్కల్, కడెం మండలం లింగాపూర్, ఖానాపూర్ మండలం సత్తెనపల్లి, తాటిగూడ తండాల్లో పరామర్శ జరుగుతుంది.
ఆదివారం ఖానాపూర్‌లో బస చేస్తారు. సోమవారం బజార్‌హత్నూర్, దిలావర్‌పూర్, లోకేశ్వరం మండలం హవర్గాలలో పరామర్శ యాత్ర నిర్వహిస్తారు. మొత్తంగా జిల్లాలో సుమారు 680 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. అనంతరం షర్మిల నిజామాబాద్ జిల్లాలో యాత్ర నిర్వహిస్తారు.
నేటి నుంచి ఆదిలాబాద్ జిల్లాలో..
Published Sat, Oct 3 2015 4:31 AM | Last Updated on Thu, Aug 9 2018 4:45 PM
Advertisement
Advertisement