కేబినెట్ భేటీ తర్వాత సుష్మా ట్విస్టు!
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ బుధవారంనాడు సమావేశం కావడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఆనవాయితీకి తాజాగా ఓ కొత్త ట్విస్టు జోడించారు విదేశాంగ సుష్మాస్వరాజ్. ప్రధానమంత్రి నివాసంలో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మీడియాకు ఆ వివరాలు తెలిపేందుకు సుష్మా రావడంతో విలేకరులు సర్‌ప్రైజ్ అయ్యారు.
ట్విట్టర్‌లో క్రియాశీలంగా ఉంటూ ఇటు ప్రజల నుంచి, అటు ప్రతిపక్షాల నుంచి విశేషామైన అభిమానాన్ని, ప్రశంసలను సుష్మా పొందారు. విదేశాంగ మంత్రిగా తన శాఖ వ్యవహారాలకు మాత్రమే పరిమితమవుతూ.. లో-ప్రొఫైల్ మెయింటెన్ చేస్తున్న ఆమె.. ఇతర అంశాలపై పెద్దగా స్పందించింది లేదు. కేబినెట్ సమావేశం తర్వాత సంబంధిత ప్రెస్‌మీట్‌లో ఆమె ఎప్పుడూ పెద్దగా పాల్గొనలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఒక్కసారిగా విలేకరుల సమావేశంలో కనిపించడం సహజంగానే ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే, ఆమె ఇలా ప్రెస్‌మీట్‌లో కనిపించడం వెనుక రెండు కారణాలు ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. సరోగేట్ తల్లులకు హక్కులు కల్పించే కొత్త బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై ప్రజల్లోకి వెళ్లేందుకు సుష్మా ఛరిష్మాను వాడుకోవాలని కేంద్రం భావిస్తోంది. అంతేకాకుండా ఈ బిల్లును రూపొందించిన మంత్రుల బృందానికి సుష్మా అధిపతిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె స్పెషల్‌గా ఈ ప్రెస్‌మీట్‌లో కనిపించారు.
విలేకరుల ఆసక్తిని గమనించిన సుష్మా.. 'మీ ఆసక్తి నాకు అర్థమైంది. నేను విదేశాంగ వ్యవహారాలపై కాకుండా.. సరోగసీ బిల్లుపై మంత్రుల బృందానికి అధిపతిగా ఇక్కడికి వచ్చాను' అని పేర్కొన్నారు.