ఎయిర్‌లైన్స్ సామర్థ్యంపై ఆడిటర్ల సందేహం
న్యూఢిల్లీ: దేశీ విమానయాన కంపెనీలు నిధుల సమీకరణ విషయంలో గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటుండటం, భారీ నష్టాల నేపథ్యంలో... వీటి నిర్వహణ సామర్థ్యంపై సందేహాలు తలెత్తుతున్నాయి. లిస్టెడ్ ఎయిర్‌లైన్స్ అయిన జెట్ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్, కింగ్‌ఫిషర్‌లు తమకు ‘గోయింగ్ కన్‌సర్న్’ స్థాయిని కల్పించుకోవడంపట్ల ఆయా కంపెనీల ఆడిటర్లే అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందికరమైన స్థితిగతులున్నా. భవిష్యత్తులో కంపెనీని నిరాటంకంగా నిర్వహించేందుకు తగినన్ని వనరులు ఉండటం, అదేవిధంగా దివాళా రిస్కులను తట్టుకునే సామర్థ్యం వంటివన్నీ ఉన్నాయని కంపెనీ తెలపడాన్ని ‘గోయింగ్ కన్‌సర్న్’గా వ్యవహరిస్తారు.
తీవ్ర ఆర్థిక సమస్యలతో కార్యకలాపాలు నిలిచిపోయిన విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు అడిటర్ల నుంచి తీవ్ర ప్రతికూలత వ్యక్తమైంది. అయితే, ఈ మూడు కంపెనీల యాజమాన్యాలు మాత్రం తమ ఆర్థిక ఫలితాలను ‘గోయింగ్ కన్‌సర్న్’ ప్రాతిపదికన ప్రకటించడంపై సమర్థించుకున్నాయి. సెప్టెంబర్ క్వార్టర్‌లో కింగ్‌ఫిషర్ రూ.715 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. మార్చి చివరినాటికి కంపెనీ మొత్తం నష్టాలు రూ.16,000 కోట్లను మించడం గమనార్హం. జెట్ ఎయిర్‌వేస్ సైతం సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.891 కోట్ల భారీ నష్టాన్ని మూటగట్టుకోగా, స్పైస్‌జెట్ రూ.559 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది.