కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రయోటర్ విజయ్ మాల్యా రుణ ఎగవేతలపై కేంద్రం దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా కార్పొరేట్ వ్యవహరాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో పనిచేసే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎస్‌ఎఫ్‌ఐఓ).. ఇప్పుడు బ్యాంకర్ల పాత్రను నిగ్గుతేల్చే పనిలో ఉంది. ప్రధానంగా కింగ్‌ఫిషర్ భారీగా నష్టాల్లోకి కూరుకుపోతున్నా.. పూర్తిస్థాయిలో మదింపు చేపట్టకుండా దానికి కొత్తగా రుణాలిచ్చిన బ్యాంకులపై దృష్టిసారించింది.
ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఉన్నాయి. రుణాల మంజూరీలో ఆయా బ్యాంకుల మాజీ చీఫ్‌ల పాత్రపై ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే 10కి పైగా బ్యాంకులకు చెందిన మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు సమన్లు పంపినట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన కొందరు మాజీ ఉన్నతాధికారులను విచారించినట్లు కూడా తెలిపాయి. మరోపక్క, మాల్యాకు చెందిన కొన్ని బ్రాండ్‌లు, ఇతరత్రా ఆస్తుల విలువను భారీగా పెంచి చూపడం ద్వారా పెద్దమొత్తంలో రుణాలిచ్చారన్న ఆరోపణలతోపాటు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి నిధులను దారిమళ్లించడంపైనా ఎస్‌ఎఫ్‌ఐఓ దృష్టిపెడుతోంది.
కాగా, ఇప్పటికే మల్యా రుణ ఎగవేతలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ(ఈడీ) ఇతరత్రా దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. 2008-09లో కింగ్‌ఫిషర్ నష్టాలు రూ.1,600 కోట్లకు పైగానే ఎగబాకగా.. 2007-10 మధ్య కాలంంలోనే బ్యాంకులు భారీగా రుణాలివ్వడం గమనార్హం. తీవ్ర నష్టాలు, రుణాల ఊబిలో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ కార్యకలాపాలు 2012లో మూతపడ్డాయి. బ్యాంకులకు రూ. 9,000 కోట్లకుపైగానే రుణాలను(వడ్డీతో కలిపి) ఎగ్గొట్టిన మాల్యాను ఇప్పటికే ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా బ్యాంకులు ప్రకటించాయి. బ్యాంకులు మాల్యా ఎగవేతలపై కేసులు పెట్టడం... సీబీఐ, ఈడీ ఇతరత్రా ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించడంతో మాల్యా ఈ ఏడాది మార్చిలో బ్రిటన్‌కు పారిపోవడం తెలిసిందే.