ముఖ్యమంత్రి మమ్మల్ని మోసం చేశారు
ముఖ్యమంత్రి మమ్మల్ని మోసం చేశారు
Published Sat, Feb 25 2017 3:39 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దాదాపు ముగింపు దశకు కూడా వస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మీద ఆరోపణలు వస్తున్నాయి. తమ సాయం కోరి కూడా ముఖ్యమంత్రి తమను మోసం చేశారని క్వామీ ఏక్తా దళ్ నాయకుడు, మాజీ మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ కుమారుడు అబ్బాస్ బిన్ ముఖ్తార్ అన్సారీ ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ మీద, ఎన్నికల గుర్తు మీద పట్పటు కోసం ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లేటప్పుడు ముఖ్యమంత్రి తన తండ్రి మద్దతు అడిగారని, పార్టీ నాయకులను తీసుకురావాల్సిందిగా కోరారని అబ్బాస్ చెప్పారు. ఇప్పుడు ఎందుకు మోసం చేశారో తెలియదు గానీ.. అప్పట్లో తన ఎదురుగానే తన తండ్రితో సీఎం మాట్లాడారని, తన తండ్రిని అసెంబ్లీలో కలిసి, రాజకీయంగా మద్దతు ఇస్తామని చెప్పారని, కావాలంటే ఎన్నికల కమిషన్‌కు ఎవరైనా ఆర్టీఐ దరఖాస్తు చేస్తే తన తండ్రి, ఇతరులు పార్టీ కోసం పోరాడిన విషయం తెలుస్తుందని అబ్బాస్ అన్నారు.
ముఖ్తార్ అన్సారీకి చెందిన క్వామీ ఏక్తా దళ్ (క్యూఈడీ)ని గత సంవత్సరం సమాజ్‌వాదీ పార్టీలో విలీనం చేయడంపై తీవ్ర వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అప్పట్లో పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ దీన్ని ఆహ్వానించగా.. ఆయన కుమారుడు అఖిలేష్ మాత్రం గట్టిగా వ్యతిరేకించారు. అన్సారీకి రాష్ట్రంలోని తూర్పు ప్రాంతాల్లో ఉండే చేనేత వర్గంలో గట్టి పట్టుంది. దాదాపు 12 వరకు అసెంబ్లీ సీట్లలో ఆయన ప్రభావం చూపగలరు.
తన తండ్రిని టార్గెట్‌గా చేసుకున్నారు గానీ గాయత్రి ప్రజాపతి, రాజా భయ్యా, పండిట్ సింగ్ లాంటి వాళ్లు మాత్రం సమాజ్‌వాదీలోనే ఉంటున్నారని అబ్బాస్ మండిపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఆశించిన మద్దతు రాకపోవడంతో ఒకప్పుడు మాఫియా డాన్‌గా ఉండి తర్వాత రాజకీయ నాయకుడైన ముఖ్తార్ అన్సారీ తన కొడుకు, సోదరుడితో కలిసి బీఎస్పీలో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముఖ్తార్ అన్సారీ యూపీలోని మావు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కుమారుడు అబ్బాస్ ఘోసి నుంచి ముఖ్తార్ సోదరుడు సిబగతుల్లా మహ్మదాబాద్ నుంచి బరిలో ఉన్నారు. అఖిలేష్ మైనారిటీలకు వ్యతిరేకమని ములాయం ఎప్పుడో చెప్పారని, ఇలాగే ఉంటే సమాజ్‌వాదీ పాలనలో ముస్లింల భవిష్యత్తుపై తమకు అనుమానాలున్నాయని అబ్బాస్ అన్నారు.
Advertisement
Advertisement