సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఝలక్!
- తండ్రి టికెట్ నిరాకరించిన వారికి పెద్దపీట
- మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన అఖిలేశ్
కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఖరారైన నేపథ్యంలో అధికార సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ 77 మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడం గమనార్హం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న రాయ్‌బరేలీలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, అమేథిలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆయన టికెట్లు ఖరారు చేశారు. పొత్తులో భాగంగా ఎస్పీ 298 స్థానాల్లో పోటీచేయనుండగా.. ఇప్పటివరకు 287 స్థానాలకు అఖిలేశ్ అభ్యర్థులను ఖరారు చేశారు.
పొత్తులో భాగంగా తమ ప్రాబల్య జిల్లాలైన రాయ్ బరేలీ, అమేథిలో అత్యధిక సీట్లు తమకే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా పట్టుపడుతోంది. అయినా అమేథి జిల్లాలోని అమేథి నియోజకవర్గం నుంచి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి, గరురిగంజ్ నుంచి రాకేష్ ప్రతాప్ సింగ్‌లతోపాటు రాయ్‌బరేలీలోని పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆశా కిషోర్, దేవేంద్రప్రతాప్ సింగ్, మనోజ్‌కుమార్ పాండే తదితరులకు అఖిలేశ్ టికెట్లు ఖరారు చేశారు. ఇక జైలు పాలైన రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి అఖిలేశ్ టికెట్ నిరాకరించారు.
బాబాయ్ శివ్‌పాల్ ప్రోద్బలంతో అన్సారీ తన ఖ్వామీ ఎక్తా దళ్ పార్టీని గత ఏడాది ఎస్పీలో విలీనం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయన స్థానంలో మరో ముస్లిం అభ్యర్థి అల్తాఫ్ అన్సారీకి అవకాశమిచ్చారు. అదేవిధంగా తండ్రి ములాయం గతంలో టికెట్ నిరాకరించిన అరుణ్‌కుమార్ వర్మకు కూడా అఖిలేశ్ టికెట్ ఇచ్చారు. గత ఏడాది ఎస్పీలో చేరిన అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ ప్రెసిడెంట్ రిచా సింగ్‌ను కూడా ఆయన బరిలోకి దింపారు.