న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఆధిపత్యపోరు అనూహ్య మలుపులు తిరుగుతూ రక్తికట్టిస్తోంది. ఎస్పీ జాతీయ అధ్యక్షుడు తానేనని, అఖిలేష్ ముఖ్యమంత్రి మాత్రమేనని ములాయం సింగ్ యాదవ్ ప్రకటించగా.. అఖిలేష్ పార్టీ కంటే గొప్పవాడని, ఏదో ఒకరోజు ప్రధాన మంత్రి అవుతారని, ఆయనకు ఆ సామర్థ్యం ఉందని రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యానించారు. తమకు పార్టీ చిహ్నం సైకిల్ వచ్చినా, రాకపోయినా.. ఈ విషయం పెద్దగా ప్రభావం చూపదని చెప్పారు. ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో ములాయం మాట్లాడుతూ రాంగోపాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, పార్టీ సభ్యుడు కాదని చెప్పారు. ఆ తర్వాత రాంగోపాల్ స్పందించారు.
అఖిలేష్‌తో కలసి తాము ధర్మయుద్ధం చేస్తున్నామని, తాను ఉన్నా లేకపోయినా ఏదో ఒకరోజు అఖిలేష్ ప్రధాని అవుతారని అన్నారు. అమర్ సింగ్, మరికొందరు ములాయంను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న అమర్ సింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఫోర్జరీ చేసేవాళ్లకు అందరూ అలాగే కనిపిస్తారని చురకలంటించారు. అన్ని ఆధారాలను ఎన్నికల సంఘానికి సమర్పించామని రాంగోపాల్ చెప్పారు.