అఖిలేశ్ యాదవ్ లేకపోతే.. ఎస్పీ లేనట్టే!
లక్నో: కన్న కొడుకు అఖిలేశ్ యాదవ్‌ను నైతికంగా దెబ్బతీసేందుకు ఎస్పీ అధినేత ములాయం సింగ్ ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ బహిష్కృత నేత రాంగోపాల్ యాదవ్ మండిపడ్డారు. ఎస్పీలో కొనసాగుతున్న అంతర్గత సంక్షోభంలో ములాయం తన తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ పట్ల కొమ్ముకాస్తున్నారని, ఆయన తటస్థంగా ఉండటం లేదని విరుచుకుపడ్డారు.
'2012లో అఖిలేశ్ పేరుతో ఎన్నికల్లోకి వెళ్లారు. ప్రజలు ఆయనకు సంపూర్ణ మెజారిటీ కట్టుబెట్టారు. అఖిలేశ్‌కు ప్రజాదరణ లేకపోతే ఆయన ఎలా గెలిచేవారు. అఖిలేశ్ లేకుంటే ఎస్పీ లేనట్టే' అని రాంగోపాల్ యాదవ్ మంగళవారం విలేకరులతో అన్నారు. పార్టీలో విభేదాలు ఎలా ఉన్నా నవంబర్ 3 నుంచి తలపెట్టిన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాలని అఖిలేశ్‌కు తాను సూచించానని, ఆయన ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పార్టీలో ఆధిపత్యాన్ని వహిస్తున్న బాబాయి శివ్‌పాల్ యాదవ్‌ను, ఆయన విధేయులను మంత్రివర్గం నుంచి అఖిలేశ్ తొలగించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా అఖిలేశ్ అనుకూల నాయకుడు, ములాయం కజిన్ సోదరుడు రాంగోపాల్ యాదవ్‌ను శివ్‌పాల్ యాదవ్ తొలగించారు. దీంతో సమాజ్‌వాదీ పార్టీలో అంతర్గత వర్గపోరు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.