90 శాతం మంది ఎమ్మెల్యేలు మా వెంటే
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో 90 శాతం మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు మద్దతు ఇస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత రాంగోపాల్ యాదవ్ చెప్పారు. పార్టీ గుర్తు విషయంపై మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్‌ను ఎన్నుకున్నామని, ఆయన సారథ్యంలోనే పార్టీ నడుస్తోందని రాంగోపాల్ చెప్పారు. పార్టీలో ఎక్కువ మంది మద్దతు ఉన్న అఖిలేష్‌కు పార్టీ చిహ్నం సైకిల్‌ను కేటాయించాలని ఈసీని కోరినట్టు తెలిపారు.
సోమవారం ములాయం సింగ్ యాదవ్ వర్గం కూడా ఎన్నికల సంఘాన్ని కలసి తమకు సైకిల్ గుర్తును కేటాయించాల్సిందిగా కోరింది. ఆధిపత్య పోరులో ములాయం కుటుంబం, పార్టీ రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. అఖిలేష్‌కు బాబాయ్ రాంగోపాల్‌తో పాటు చాలామంది పార్టీ సీనియర్లు, ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. ములాయం వెంట సోదరుడు శివపాల్ యాదవ్, సన్నిహితుడు అమర్ సింగ్‌తో పాటు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్ష పదవి నుంచి ములాయంను తొలగించి ఆయన కొడుకు అఖిలేష్‌ను ఎన్నుకున్నారు. అప్పటి నుంచి రెండు గ్రూపులు పార్టీ గుర్తు కోసం పోరాడుతున్నాయి.