ములాయం 'సైకిల్' అఖిలేశ్‌కేనా?
లక్నో: సమాజ్‌వాది పార్టీ పూర్తిగా సీఎం అఖిలేశ్ యాదవ్ చేతుల్లోకి వెళ్లిపోయేలా కనిపిస్తోంది. ఆ పార్టీ గుర్తు కూడా ఈసీ అఖిలేశ్ వర్గమే కొల్లగొట్టేలా కనిపిస్తోంది. సమాజ్ వాది పార్టీలో ఉన్న నేతలంతా కూడా అఖిలేశ్ వెనుకే క్యూ కట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సమాజ్ వాది పార్టీ మొత్తం తమతోనే ఉందని అఖిలేశ్ వర్గంలోని కీలక నేత రాంగోపాల్ యాదవ్ మరోసారి అన్నారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 229మంది ఎమ్మెల్యేల్లో 212మంది తమతోనే ఉన్నారని, అలాగే 68మంది ఎమ్మెల్సీల్లో 56మంది ఉన్నారని, ఇక 24 మంది ఎంపీల్లో 15మంది తమతోనే ఉన్నారని ఆయన చెప్పారు. వీరంతా కూడా తమకు మద్దతిస్తూ సంతకాలు చేశారని చెప్పారు. పార్టీ అధికారిక గుర్తుకు సంబంధించి ఈసీకి అందించాల్సిన అఫిడవిట్‌లో వీరంతా సంతకాలు కూడా చేసినట్లు ఆయన తెలిపారు. పార్టీ గుర్తు అయినా సైకిల్ తమకే వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సాయంత్రంలోగా ఈసీకి అఫిడవిట్ అందిస్తామని చెప్పారు.