స్టార్ లీడర్
‘ఒకప్పటి’ అనే మాట జయప్రదకు ఎప్పటికీ వర్తించదేమో!
సినిమాల్లో ఉన్నా, లేకున్నా.. గ్లామర్‌లో ఆమె స్టార్.
రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా, ఆ పార్టీకి ఆమె బ్రాండ్ లీడర్.
పన్నెండేళ్ల వయసుకే సినిమాల్లోకి, ముప్పై రెండేళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చేశారు జయప్రద. పెళ్లి కూడా అంతే! చిన్న వయసులోనే జరిగిపోయింది. ఇరవైనాలుగేళ్లన్నది పెళ్లికి చిన్న వయసేం కాదు. అయితే సినిమాల్లో బిజీగా ఉన్న ఒక స్టార్ నటికి అది బాల్య వివాహమే! జయప్రద తొలి సినిమా ‘భూమికోసం’. తొలి పార్టీ ‘తెలుగుదేశం’. ఇవి రెండూ ఆమెను మరికొన్ని సినిమాలకు, మరికొన్ని పార్టీలకు నడిపించాయి. పెళ్లే.. ఆమెను ఏడడుగులకు మించి ముందుకు నడిపించలేకపోయింది. జయప్రదకు పిల్లల్లేరు. వద్దనుకుంటే లేకపోవడం కాదు. పుట్టే భాగ్యం లేక లేకపోవడం కాదు. మరి ఎందుకు?
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 సమీపంలోని జయప్రద విడిది గృహంలో కొన్నాళ్ల క్రితం సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఆమెను కలిశారు. ఆ రోజు మిగతా మీడియా ప్రతినిధులెవరూ లేరు. జయప్రద, సాక్షి. అంతే. అదొక అపూర్వమైన సందర్భం. జయప్రద ఎన్నో సినిమాల్లో నవ్వి ఉంటారు. ఆ రోజు నవ్విన నవ్వు ఏ సినిమాలోనూ లేనిది. చిన్న పిల్ల నవ్వినట్టు పడీ పడీ నవ్వారు. ఆమె పోటీ నటి శ్రీదేవి ‘పదహారేళ్ల వయసు’ సినిమాలో ‘కట్టుకథలు సెప్పి నేను కవ్విస్తే.. నేను నవ్విస్తే..’ అనే పాటలో నవ్విన నవ్వేం పనికొస్తుంది? అలా నవ్వారు. అంత నవ్వూ.. ‘మీకు పిల్లలెందుకు లేరు?’ అన్న ప్రశ్న దగ్గర సడన్‌గా ఆగిపోయింది! ‘మీరు పిల్లలెందుకు వద్దనుకున్నారు?’ అని నేరుగా అడగలేకపోయారు సాక్షి ప్రతినిధి. అందుకే ‘మీకు పిల్లలెందుకు లేరు?’ అని అడిగారు. జయప్రద గ్రహించారు. ‘మీరు నేరుగా అడగలేని ప్రశ్నకు సమాధానం కూడా నేను నేరుగా చెప్పలేనిదే’ అన్న భావం సాక్షి ప్రతినిధికి ఆమె మౌనంలో ధ్వనించింది.
జయప్రద గత సోమవారం షిర్డీ దర్శనానికి వచ్చి వెళ్లారు. ఆలయ ప్రాంగణం బయట ఈ సౌందర్యరాశి కొన్ని నిమిషాలపాటు అభిమానులకు దర్శనమిచ్చారు. ఆమెలో నేటికీ ‘పూర్వపు నటి’ ఛాయలు మొదలు కాలేదు! సినిమాలు చేస్తే మళ్లీ చూస్తారు. రాజకీయాల్లోకి వస్తే మళ్లీ రాణిస్తారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్‌లో ఉన్నారు! దేశంలో కాంగ్రెస్ ఉండీ లేనట్లు ఉన్నట్లే, జయప్రద కాంగ్రెస్‌లో ఉన్నారు. బీజేపీ ఆహ్వానిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్నటి వరకు జయప్రద పార్టీ ఆర్.ఎల్.డి. రాష్ట్రీయ లోక్ దళ్. 2014లో యూపీలోని బిజ్నోర్ నుంచి ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అది అజిత్‌సింగ్ పార్టీ. అంతకు ముందు ఆమె పార్టీ ఆర్.ఎల్.ఎం. రాష్ట్రీయ లోక్ మంచ్. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు. అప్పటికి ఆమె సమాజ్‌వాదీ పార్టీ నుంచి రెండోసారి రాంపూర్ ఎంపీగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ అమర్‌సింగ్‌తో పాటు, అతడికి బహిరంగ మద్దతు ఇచ్చిన జయప్రదనూ పార్టీ నుంచి బహిష్కరించడంతో అమర్‌సింగ్ సొంత పార్టీ పెట్టుకుని (అదే ఆర్.ఎల్.ఎం) జయప్రదను కూడా కలుపుకున్నారు.
రీ ఎంట్రీ? నో ఎంట్రీ?
సమాజ్‌వాదీ పార్టీలోకి రాకముందు టీడీపీలో ఉన్నారు జయప్రద. ఎన్టీఆర్ ఆమెను రాజకీయాల్లోకి తెచ్చారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఆమెను తన రాజకీయాల్లోకి తెచ్చుకున్నారు. తెలుగు మహిళను చేశారు. రాజ్యసభకూ పంపారు. చివరికి పార్టీ నుంచే బయటికి పంపేశారు. అక్కడి నుంచి సమాజ్‌వాదిలోకి వెళ్లిపోయారు జయప్రద. సినిమా ప్రొఫైల్ కన్నా, రాజకీయాల్లో జయప్రద ప్రొఫైల్ చాలా పెద్దది! మూడు వందల సినిమాల్లో నటించారు కదా అనిపించవచ్చు. ఒకవేళ నరేంద్రమోదీ కనుక 2019 ఎన్నికల కోసం ఆమెను పార్టీలోకి తీసుకోదలిస్తే ఆమె నటించిన సినిమాలన్నిటినీ ముందేసుకుని చూడమని మాత్రం అమిత్‌షాకు కచ్చితంగా పురమాయించరు. ఆరేళ్లు రాజ్యసభ సభ్యురాలిగా, పదేళ్లు ఎంపీగా జయప్రద అతి కీలకమైన అనేక ప్రభుత్వ కమిటీలలో సభ్యురాలిగా ఉన్నారు. అదొక పెద్ద జాబితా. మోదీకి పరిశ్రమలు ముఖ్యం. విదేశీ వ్యవహారాలు ముఖ్యం. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్యం. ఇక ముఖ్యం అయినా కాకున్నా.. ఉమెన్ ఎంపవర్‌మెంట్ కూడా ఆయనకు ముఖ్యం. ఈ కమిటీలన్నింటిలోనూ పనిచేసిన అనుభవం జయప్రదకు ఉంది. అది మోదీ ఇమేజీకి ఉపయోగపడుతుంది. జయప్రద కూడా ఇప్పుడు మోదీ పాలనా విధానాలను సమర్థిస్తున్నారు. మొన్న షిర్డీ వచ్చినప్పుడు మోదీ నోట్ల ఉపసంహరణ నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడారు. అయితే ఈ మాట్లాడ్డం ఒక ఎత్తుగడగా జరిగిందని మాత్రం అనుకోవడానికి లేదు. జయప్రదలోని రాజకీయ విజ్ఞత ఇంకా అంత ‘ఎత్తుకు’ ఎదగలేదు. ఇరవై ఆరేళ్ల రాజకీయ జీవితంలోనూ ఎక్కడా ఆమె తన ఉద్దేశాలను, ఉద్వేగాలను దాచుకోలేదు. కోపం వస్తే అరిచేశారు. భయం వేస్తే ఏడ్చేశారు. తను నమ్మినవాళ్ల వెంట వెళ్లిపోయారు. తనను నమ్ముకున్న వాళ్ల వెంట వచ్చేశారు. ఎన్నికల కోడ్‌ని కూడా చూసుకోకుండా.. మహిళా ఓటర్ల నుదుటిపై ఆప్యాయంగా బొట్టు పెట్టారు. ఇప్పుడు కూడా, తను మోదీ వైపు మాట్లాడుతున్నప్పటికీ.. మోదీకి రాజకీయ ప్రత్యర్థులైన ములాయంని కానీ, అఖిలేశ్‌ని కానీ ఆమె విమర్శించడం లేదు.
ములాయం తనను పార్టీ నుంచి బహిష్కరించారన్న బాధ ఆమెలో లేదు. అఖిలేశ్ నాకు తమ్ముడి లాంటి వాడు. ములాయం నాకు తండ్రి లాంటి వారు అంటున్నారు. అలాగని ఆ తండ్రీకొడుకుల పాలనలో యూపీ భలే బాగుందని అనడం లేదు. ఆ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని జయప్రద ఏమాత్రం సంశయం గానీ, సంకోచం గానీ లేకుండా అంటున్నారు. రాజకీయాల్లో ఇది అరుదైన గుణం. ఈ గుణం బీజేపీకైనా, ఇంకొక పార్టీకైనా ఎంతవరకు పనికొస్తుందనేదాన్ని బట్టి మాత్రమే జయప్రద రాజకీయ పునఃప్రవేశం అన్నది సంభవం అవుతుంది.
అంతులేని కథ
‘భూమికోసం’ చిత్రం తర్వాత జయప్రద నటించిన పెద్ద సినిమా ‘అంతులేని కథ’. అప్పుడు ఆమె వయసు పదిహేనేళ్లు. డైరెక్టర్ కె.బాలచందర్! తమిళంలో హిట్ అయిన సినిమానే తెలుగులో తీస్తున్నారు ఆయన. తమిళ్‌లో సుజాత చేసిన పాత్రను ఇక్కడ జయప్రద వెయ్యాలి. అంత నిండైన పాత్రను ఈ అమ్మాయి చెయ్యగలదా? పెళ్లీడు దాటిపోయిన అమ్మాయిగా కనిపించాలి. కనిపించగలదా? సందేహాలన్నీ ఎగరగొట్టేశారు జయప్రద. బాలచందర్ ఎప్పుడో గానీ చప్పట్లు కొట్టరట. షూటింగ్‌లో రజనీకాంత్, జయప్రదల మధ్య సన్నివేశంలో జయప్రద నటనకు ఆయన క్లాప్స్ కొట్టారు. ‘సినిమాలకు పనికొస్తానా?’ అని ముందు భయపడిన జయప్రద.. ‘అంతులేని కథ’ విడుదలయ్యాక సినిమాలే జీవితంగా స్క్రీన్ మీదికి వచ్చేశారు. సిరిసిరిమువ్వ, భద్రకాళి, అడవిరాముడు, యమగోల, అందమైన అనుభవం, సాగర సంగమం, దేవత, మేఘసందేశం.. ఇవి కాక.. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో మొత్తం మూడు వందలకు పైగా సినిమాలు చేశారు.
ఇప్పటికీ అలాగే!
జయప్రద ఆరోగ్యంగా ఉంటారు. అదే ఆమె అందం. ఆ అందానికి కారణం మాత్రం ఆమె తీసుకునే ఆహారం, తీసుకోని ఆహారం కూడా! ఎప్పుడోగానీ జయప్రద లంచ్‌లో, డిన్నర్‌లో రైస్ ఉండదు. పండ్లు, పండ్ల రసాలు, తాజా కూరగాయలు, ఎగ్ వైట్ ఆమ్లెట్ తీసుకుంటారు. సూప్స్ తాగుతారు. పూర్తిగా ఆకలి వేసే వరకు ఆగరు. కడుపు నిండా తినరు. పొట్ట తేలిగ్గా ఉంటే, ఒళ్లు హుషారుగా ఉంటుందట. ఈ ఆహార నియమాలతో పాటు యోగా చేస్తుంటారు. జిమ్‌కు వెళుతుంటారు.
తొలి పారితోషికం 10 రూపాయలు
‘భూమికోసం’ చిత్రంలో చెల్లి చంద్రమ్మగా చిన్న వేషం వేశారు జయప్రద. తొలిషాట్ నెల్లూరులో. పొలాల మధ్య నుంచి తలపై బుట్ట పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంటుంది. ఆ సినిమాకు ఆమెకు వచ్చిన రెమ్యునరేషన్ పది రూపాయలు.
పోటా పోటీ
జయప్రద, శ్రీదేవి ఇంచుమించు ఒకే ఈడు వారు. ఒక స్క్రీన్ కడుపున పుట్టిన తోబుట్టువుల్లా కనిపించేవారు. శోభన్‌బాబు నటించిన ‘దేవత’ సినిమాలో వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లుగా కూడా నటించారు. అయితే బయట మాత్రం ఒకరితో ఒకరు ముభావంగా ఉండేవారు! ఎందుకనో దగ్గరితనం ఉండేది కాదు. ‘పోటీ ఉండేది కాబట్టి అలా ఉండేవాళ్లమేమో’ అని అనేవారు జయప్రద. రెండేళ్ల క్రితం 2015 నవంబర్ 27న హైదరాబాద్‌లో జయప్రద దత్తపుత్రుడు సిద్ధార్థ్ పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి శ్రీదేవి వచ్చారు. ఆ సందర్భంలో వాళ్లిద్దరూ చాలా ఆత్మీయంగా కనిపించారు.
పదవులు–బాధ్యతలు
1996–2002 : రాజ్యసభ సభ్యురాలు
1996–97 : పరిశ్రమలు, విదేశీ వ్యవహారాలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, సంప్రదింపులు, సమాచారం–ప్రసారాలు.. ఈ కమిటీలన్నింటిలో సభ్యురాలు.
2004 : ఎంపీగా ఎన్నిక. (యూపీలోని రాంపూర్ నియోజకవర్గం)
2004–09 : సమాచార సాంకేతిక పరిజ్ఞానం, మహిళా సాధికారత, జల సంరక్షణ, నిర్వహణలపై పార్లమెంటరీ ఫోరం.. ఈ కమిటీలన్నింటిలో సభ్యురాలు.
2009 : రెండోసారి ఎంపీగా ఎన్నిక (మళ్లీ అదే నియోజకవర్గం)
2009 : ఫైనాన్స్ కమిటీలో సభ్యురాలు.
ఇవన్నీ కాక.. 2014 వరకు ప్రభుత్వ, ప్రైవేటు సామాజిక సేవాకార్యక్రమాలలో చురుకైన పాత్ర.
వ్యక్తిగతం
జయప్రద (54): నటి, రాజకీయ నాయకురాలు
అసలు పేరు: లలితారాణి
జననం: 3 ఏప్రిల్ 1962
జన్మస్థలం: రాజమండ్రి (ఆం.ప్ర)
తల్లిదండ్రులు: కృష్ణారావు, నీలవేణి
చదువు: బి.ఎ.
భర్త: శ్రీకాంత్ నహతా
సంతానం: లేరు
ఉండడం: ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్
అభిరుచులు: మ్యూజిక్, డ్యాన్స్, చిత్రలేఖనం
- మాధవ్ శింగరాజు