ములాయంకు ఎమ్మెల్యేల ఝలక్
సమాజ్‌వాదీ పార్టీకి ఇంకా తానే పెద్ద అనుకుంటున్న ములాయం సింగ్ యాదవ్‌కు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు భారీ షాకిచ్చారు. వాళ్లందరితో ఓ సమావేశం ఏర్పాటుచేసి, వాళ్లకు భోజన ఏర్పాట్లు కూడా చేద్దామనుకున్న పెద్దాయనను కాదని, తాము ఉండబోయేది అఖిలేష్ యాదవ్‌తోనే అని తేల్చిచెప్పేశారు. దాంతో చిన్నబుచ్చుకున్న పెద్దాయన.. తాను ఏర్పాటుచేసిన సమావేశాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున గత ఎన్నికల్లో మొత్తం 47 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వాళ్లతో పాటు ఎమ్మెల్సీలు కూడా కలిసి తమ శాసనసభాపక్ష నాయకుడిగా అఖిలేష్ యాదవ్‌ను ఎన్నుకున్నారు.
ఇందుకోసం ఏర్పాటుచేసిన సమావేశంలో.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా అఖిలేష్ యాదవ్ ఏర్పాటుచేసే సమావేశాలకు మాత్రమే వెళ్లాలి తప్ప పార్టీ తరఫున మరెక్కడికీ వెళ్లకూడదని సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే లలాయ్ సింగ్ ప్రతిపాదించారు. సమావేశంలో ఎక్కడా ములాయం పేరు ప్రస్తావనకే రాలేదు. జనవరి వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించిన ములాయం నుంచి.. అఖిలేష్ యాదవ్ ఆ పదవి లాగేసుకున్న విషయం తెలిసిందే. పార్టీ పగ్గాలను పూర్తిగా తన చేతిలో పెట్టుకుని కూడా అఖిలేష్ ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడక తప్పలేదు. అయినా సరే పార్టీ మీద మాత్రం తన ఆధిపత్యం కొనసాగించాలని అఖిలేష్ గట్టి పట్టుతో ఉన్నారు.
అయితే.. అఖిలేష్ నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశానికి ఆయన బాబాయ్, ఎమ్మెల్యే శివపాల్ యాదవ్ డుమ్మా కొట్టారు. అలాగే తండ్రీ కొడుకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు విశ్వప్రయత్నాలు చేసిన మరో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆజంఖాన్ కూడా ఈ సమావేశానికి రాలేదు. అసెంబ్లీలో తనను ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేయకపోవడంతో ఆజంఖాన్ అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. శాసనమండలిలో సభ్యుడిగా ఉన్న అఖిలేష్ యాదవ్.. ఆ హోదాతో శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యేందుకు, ప్రతిపక్ష నేతగా వ్యవహరించేందుకు అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలకు కలిపి 325 స్థానాలు రాగా, రెండోస్థానంలో నిలిచిన సమాజ్‌వాదీ పార్టీకి కేవలం 47 స్థానాలే వచ్చాయి.