'స్టాలిన్ మూడు నెలల్లో చనిపోతాడట'
ఇటీవలే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తన పెద్ద కొడుకు ఎంకే అళగిరిపై కరుణానిధి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. స్టాలిన్ మూడు నెలల్లో చనిపోతాడని అళగిరి తనకు చెప్పినట్లు కరుణ వెల్లడించారు. 'స్టాలిన్ అంటే అళగిరికి ఎందుకోగానీ అస్సలు పడదు. స్టాలిన్ మూడు నెలల్లో చచ్చిపోతాడని కూడా అన్నాడు. కన్న కొడుకు గురించి ఇలాంటి మాటలను ఏ తండ్రీ సహించలేడు. కానీ పార్టీ అధినేతగా నేను సహించాల్సి వచ్చింది' అని కరుణానిధి విలేకరుల సమావేశంలో అన్నారు.
జనవరి 24వ తేదీ ఉదయం అళగిరి తన ఇంటికి వచ్చి, స్టాలిన్ గురించి చాలా చెడ్డగా మాట్లాడాడని కరుణ చెప్పారు. పార్టీ అధినే ఇంటికి తెల్లవారుజామున 6, 7 గంటల సమయంలో రావడం సరైనదేనా అన్నారు. మదురైలో పార్టీకి వ్యతిరేకంగా అళగిరి ఇచ్చిన ఇంటర్వ్యూల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. డీఎండీకేతో పొత్తు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంతో ఫలితాలు సరిగా రాలేదన్నారు. చాలా కాలంగా పార్టీ కోశాధికారి స్టాలిన్ గురించి అళగిరి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని కరుణానిధి మండిపడ్డారు. క్షమాపణ చెబితే అళగిరిపై సస్పెన్షన్ ఎత్తేస్తారా అని అడగ్గా, ఆ విషయం అతడినే అడగాలని చెప్పారు.