పార్లమెంటులో టీ-బిల్లుకు మద్దతివ్వండి: టీ.జేఏసీ నేతలు | All National Parties to support for Telangana Bill in Parliament winter sessions | Sakshi
Sakshi News home page

పార్లమెంటులో టీ-బిల్లుకు మద్దతివ్వండి: టీ.జేఏసీ నేతలు

Published Wed, Dec 4 2013 2:40 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

పార్లమెంటులో టీ-బిల్లుకు మద్దతివ్వండి: టీ.జేఏసీ నేతలు - Sakshi

పార్లమెంటులో టీ-బిల్లుకు మద్దతివ్వండి: టీ.జేఏసీ నేతలు

 జాతీయ పార్టీలకు టీ.జేఏసీ నేతల విజ్ఞప్తి
 సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని టీజేఏసీ నేతలు పలు జాతీయ పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకించాలని వారు కోరారు. టీజేఏసీ ైచైర్మన్ కోదండరాం నేతృత్వంలో నేతలు తెలంగాణకు మద్దతు తెలిపిన రాజకీయపక్షాలను కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ, బిల్లుకు మద్దతు కూడగట్టే పనిలో మంగళవారం రోజంతా బిజీగా గడిపారు. తొలుత ఉదయం గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వద్ద గంట సేపు మౌన దీక్ష చేశారు. అనంతరం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డిని కలిసి తెలంగాణకు మద్దతు కోరారు. ఆ తర్వాత సాయంత్రం బీజేపీ అధ్యకుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆయన నివాసంలో కలుసుకుని తెలంగాణకు మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నరాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందని, తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని రాజ్‌నాథ్ తేల్చిచెప్పారు. సీఎం కిరణ్ వైఖరి ఎలా ఉందని, విభజన తర్వాత ఉద్యోగుల పరిస్థితి ఏమిటని, రాయల తెలంగాణ ప్రతిపాదన తదితర అంశాలపై రాజ్‌నాథ్ జేఏసీ నేతలతో మాట్లాడారు. కిరణ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా, సీమాంధ్రకు సీఎంగా వ్యవహరిస్తున్నారని నేతలు చెప్పారు.
 
  విభజన జరిగితే ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన తెలంగాణను అడ్డుకోడానికి ఆంధ్రవారు వేసిన ఎత్తుగడ అని రాజ్‌నాథ్‌కు చెప్పారు. అనంతరం టీజేఏసీ నేతలు జేడీయూ అధినేత శరద్‌యాదవ్‌ను కలుసుకున్నారు. యూపీఏ బిల్లు పెడితే తాము మద్దతు ఇస్తామని శరద్ యాదవ్ హామీ ఇచ్చారన్నారు. నేతల భేటీల సందర్భంగా టీజేఏసీ కన్వీనర్ కోదండరాం, శ్రీనివాస్‌రెడ్డి, దేవీప్రసాద్,  విఠల్, మల్లేపల్లి లక్ష్మయ్య, వెంకటస్వామి,  తదితరులు  మీడియాతో మాట్లాడారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. జీవోఎం తుది భేటీ తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. బుధవారం ఎన్సీపీ, బీఎస్పీ సహా తెలంగాణకు మద్దతు ఇచ్చిన పార్టీలను కలుస్తామని చెప్పారు.
 
 తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదించాలి: సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ)
 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి, దానిని ఆమోదించాలని సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యతేంద్ర కుమార్ మంగళవారం ఒక ప్రకటన చేశారు. రాయల తెలంగాణ పేరిట రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement