
కేంద్రం దేశం గురించి ఆలోచిస్తోంది
ప్రధాని మోదీని కలసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని తాను అడిగితే ఆయన దేశం గురించి ఆలోచిస్తున్నట్టుగా తనతో చెప్పారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు...
- ప్రత్యేక హోదా కోసం అంతా వేచి చూడాలి: చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రధాని మోదీని కలసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని తాను అడిగితే ఆయన దేశం గురించి ఆలోచిస్తున్నట్టుగా తనతో చెప్పారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రత్యేకహోదా అంశం గురించి సహనంతో ఎదురు చూడాలి తప్ప ప్రజలు భావోద్వేగాలకులోనై ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడరాదని చెప్పారు. రాజధాని నిర్మాణానికి ఇప్పుడున్న భూమి సరిపోదని, ఈ విషయం గురించి అవసరమైతే పవన్ కల్యాణ్‌తో మాట్లాడతానని అన్నారు.
విజయవాడ క్యాంపు కార్యాయంలో గురువారం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రధానితో తాను గంటన్నరపాటు చర్చించాననీ, ఆయన అనుమానాలన్నీ తీర్చానన్నారు. రోడ్ మ్యాప్ తయారు చేయిస్తానని ప్రధాని హామీ ఇచ్చారనీ దీనిపై వీలైనంత త్వరగా క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నానన్నారు. తాను ముందుగా ప్రత్యేక హోదాను అడిగానని, బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని కోరానని ఆయన చెప్పారు.
భూములివ్వకపోతే ఆకాశంలో భవనాలు కడతామా?: రాజధానికి భూములు ఇవ్వకుండా కొందరు అడ్డుపడుతున్నారని, భూములు ఇవ్వకుంటే భవనాలు ఆకాశంలో నిర్మిస్తామా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో భవనాలు మాత్రమే కాదని, అన్నీ రావాలంటే ఇప్పుడున్న భూమి సరిపోదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు తనపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయని అన్నారు.
అలక్ష్యాన్ని సహించను..: ‘‘దరిద్రం కాకపోతే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుక కరిచి శిశువు చనిపోయాడు. పశ్చిమగోదావరి జిల్లాలో సైకో దాడి చేసి ఇంజక్షన్‌లు చేస్తున్నాడు.. అయితే పోలీసులు ఇంత వరకూ సైకోని పట్టుకోలేకపోయారు..’’ అని సీఎం అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులను మందలించానని, మీ వల్లకాకపోతే అక్కడికి తానే వస్తానని చెప్పానని అన్నారు.
వృత్తిదారుల శిక్షణకు కార్యాచరణ: చేతి వృత్తిదార్లు, కులవృత్తిదారులకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ రాయితీలు పొందుతున్న బీసీల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని సూచించారు.