అమెరికా సహాయ ప్యాకేజీలో మరింత కోత
ట్యాపరింగ్ స్పీడ్ పెంచిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్
మరో 10 బిలియన్ డాలర్లు కట్; ఫిబ్రవరి నుంచే అమలు
బాండ్‌ల కొనుగోళ్లు ఇక నెలకు 65 బిలియన్ డాలర్లకే పరిమితం
వాషింగ్టన్: అమెరికాలో ఆర్థిక సహాయ ప్యాకేజీకి కోత(ట్యాపరింగ్)ను అక్కడి సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్(ఫెడ్) వేగవంతం చేసింది. ఫెడ్ చైర్మన్‌గా తన ఆఖరి సమీక్షను నిర్వహించిన బెన్ బెర్నాంకీ ప్యాకేజీకి మరింత కోత పెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం నెలకు 75 బిలియన్ డాలర్లుగా ఉన్న బాండ్‌ల కొనుగోళ్ల పథకంలో ఫిబ్రవరి నుంచి మరో 10 బిలియన్ డాలర్లు తగ్గించనున్నట్లు ప్రకటించారు. దీంతో ప్యాకేజీ 65 బిలియన్ డాలర్లకే పరిమితం కానుంది. డిసెంబర్‌లో కొత్త ఉద్యోగాల వృద్ధి మందగించడం, వర్ధమాన దేశాల మార్కెట్లలో భారీ పతనం వంటివి చోటుచేసుకున్నా... బెర్నాంకీ మాత్రం వరుసగా రెండో నెలలోనూ ట్యాపరింగ్‌ను ప్రకటించడం గమనార్హం. నెలకు 85 బిలియన్ డాలర్లుగా ఉన్న బాండ్‌ల కొనుగోళ్ల ప్యాకేజీలో తొలిసారిగా డిసెంబర్ సమీక్షలోనే ఫెడ్ 10 బిలియన్ డాలర్లను కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇది 75 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2012 సెప్టెంబర్‌లో ఈ ప్యాకేజీ ఆరంభమైంది. నెలనెలా 10 బిలియన్ డాలర్ల చొప్పున కోతపెడతామని గతనెలలోనే బెర్నాంకీ చెప్పారు. ఈ ఏడాది ఆఖరికల్లా బాండ్‌ల కొనుగోళ్లను నిలిపేయొచ్చని కూడా సంకేతాలిచ్చారు.
వడ్డీరేట్లు యథాతథం...
పాలసీ వడ్డీరేట్లను ఇప్పుడున్న జీరో స్థాయిలోనే కొనసాగించాలని ఫెడ్ నిర్ణయించింది. ప్రస్తుతం పాలసీ రేటు పావు శాతంగా ఉంది. వచ్చే ఏడాది మధ్యవరకూ ఇదే స్థాయిలో ఉండొచ్చని అంచనా. ‘గత సమావేశం తర్వాత ఉద్యోగ గణాంకాల్లో మిశ్రమ సంకేతాలు వెలువడ్డాయి. అయితే, వ్యాపార పరిస్థితులు, ప్రజల వినియోగ వ్యయం ఇటీవల మరింత పుంజుకుంది. దీంతో ఫిబ్రవరి నుంచి 75 బిలియన్ డాలర్ల విలువైన బాండ్‌లు, మార్ట్‌గేజ్ సెక్యూరిటీలను మాత్రమే కొనాలని నిర్ణయించాం’ ఫెడ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
వచ్చే సమీక్ష కొత్త చైర్మన్ యెలెన్ నేతృత్వంలో...
దాదాపు ఎనిమిదేళ్లు ఫెడ్ చైర్మన్‌గా కొనసాగిన బెర్నాంకీ పదవీ కాలం నేటితో(జనవరి 31)ముగుస్తోం ది. బెర్నాంకీ స్థానంలో ప్రస్తుత వైస్ చైర్మన్ జానెట్ యెలెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. తదుపరి సమీక్ష ఆమె నేతృత్వంలోనే జరగనుంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్‌కు తొలి మహిళా చైర్మన్‌గా ఆమె ఎన్నికవడం తెలిసిందే.
ట్యాపరింగ్‌పై భయాలొద్దు: చిదంబరం
న్యూఢిల్లీ: అమెరికాలో ట్యాపరింగ్ విషయంలో భారత్‌లో భయపడాల్సిన అవసరం లేదని ఆర్థికమంత్రి చిదంబరం భరోసా ఇచ్చా రు. భారత్ మార్కెట్లపై ఈ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపబోదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అప్రమత్తంగా ఉన్నట్లు ఆర్థికశాఖ మరో ప్రకటనలో పేర్కొంది.