
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌తో అమిత్ షా భేటీ!
న్యూఢిల్లీ: మరికొద్ది గంటల్లో మంత్రులుగా ప్రమాణం చేయనున్నవారి జాబితాకు సంఘ్ ఆమోదం కూడా లభించినట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గురువారం రాత్రి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిసి, ఈ మేరకు జాబితాను ఆయన ముందుంచినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ విషయాన్ని బీజేపీగానీ, ఆర్‌ఎస్‌ఎస్‌గానీ ధృవీకరించలేదు.
ఆరెస్సెస్ సమన్వయ సమావేశాల నిమిత్తం యూపీలోని బృందావన్‌లో ఉన్న భగవత్ వద్దకు వెళ్లిన అమిత్ షా.. దాదాపు రెండు గంటలపాటు భేటీ అయ్యారని, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సీనియర్ నేతలైన రామ్‌లాల్, సురేశ్ సోనీ, కృష్ణ గోపాల్, భయ్యాజీ జోషి, దత్తాత్రేయ హోసబలే తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం.శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్న అమిత్‌షా.. ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలతో భేటీ వివరాలను వెల్లడించనున్నట్లు తెలిసింది.