
అమిత్ షాకు ఉద్ధవ్ ఠాక్రే ఝలక్!
- అసమగ్రంగా ముగిసిన భేటీ
- ముందు రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించండి
- ఆ తర్వాతే మద్దతు కోరండి..
- బీజేపీకి తేల్చిచెప్పిన మిత్రపక్షం
ముంబై: రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం ఎంతో ఆశతో తన గుమ్మాన్ని తొక్కిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు మిత్రపక్షం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే చిన్నపాటి ఝలక్ ఇచ్చారు. ముందు రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయండి.. ఆ తర్వాతే మద్దతు కోరండని అమిత్ షాకు ఠాక్రే తేల్చిచెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఎన్నో అంచనాల మధ్య సాగిన అమిత్‌షా-ఉద్ధవ్ ఠాక్రే భేటీ అసంపూర్ణంగా ముగిసింది.
రాష్ట్రపతి అభ్యర్థుల విషయమై శివసేన ఇప్పటికే ఇద్దరి పేర్లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షా-ఠాక్రే మధ్య 75 నిమిషాలపాటు ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో ఉద్ధవ్‌తోపాటు ఆయన కొడుకు ఆదిత్య, షాతోపాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడవ్నిస్ కూడా పాల్గొన్నారు. పేరుకు మిత్రపక్షాలైన ఉప్పు-నిప్పులా మహారాష్ట్రలో బీజేపీ-శివసేన బంధం కొనసాగుతోంది. ఇటీవల రుణమాఫీ విషయమై బాహాటంగానే బీజేపీ సర్కారుపై సేన నిప్పులు కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన అమిత్ షా-ఉద్ధవ్ ఠాక్రే భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.