
ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఐదు రోజులపాటు కొనసాగిన సమావేశాల్లో 9 బిల్లులు ఆమోదం పొందాయి. మొత్తం 20 గంటల 39 నిమిషాలపాటు సమావేశాలు కొనసాగాయి. రెండు వాయిదాల తర్వాత సమావేశమైన అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులిద్దరూ సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ప్రవేశపెట్టారు. ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాసిన లేఖలో స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచారని, ఆయనపై చర్య తీసుకోవాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే జయ నాగేశ్వరరావు, అసెంబ్లీ లాంజ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో అతికించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని టీడీపీ సభ్యురాలు అనిత సభా హక్కుల ఉల్లంఘన నోటీసిచ్చారు.
ఈ సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ... ఓటుకు కోట్లుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పొడియం చుట్టుముట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన రెండు నోటీసులను ప్రివిలేజ్ కమిటీకి నివేదిస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆ వెంటనే సభను నిరవధికంగా వాయిదా వేశారు. మరో వైపు ఇవాళ జరిగిన సమావేశాలకు ముఖ్యమంత్రి దూరంగా ఉన్నారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌కే ఆయన పరిమితమైయ్యారు.