అసెంబ్లీలో గందరగోళం, సభ రేపటికి వాయిదా
హైదరాబాద్ : రెండుసార్లు వాయిదా అనంతరం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ శనివారానికి వాయిదా పడింది. ప్రత్యేక హోదా అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండోరోజు కూడా దద్దరిల్లింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో హోరెత్తింది. దీంతో సభలో వాయిదాల పర్వం కొనసాగింది. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే వాయిదా తీర్మానంపై చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టింది.
ప్రజలందరూ కోరుకొంటున్నట్లుగా ఈ అంశంపై చర్చించాలని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే ముందు ప్రకటన చేస్తామని ఆ తర్వాతే చర్చ చేపట్టాలని అధికార పక్షం స్పష్టం చేసింది. విపక్షం మాత్రం ప్రభుత్వ ప్రకటనకు తాము ఒప్పుకునేది లేదని, ముందు చర్చ చేపట్టాలని తెలిపింది. ప్రశాంతంగా ప్రారంభమైన సభలో అధికార పక్షం రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహారించింది.
చర్చకు పట్టుబట్టిన విపక్షానికి సర్దిచెప్పాల్సిన అధికార పక్షం అనవసర వ్యాఖ్యలు చేసింది. లోటస్ పాండ్ రూల్స్ సభలో నడవవంటూ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. సభను 15 నిమిషాలు కూడా నడవకుండా విపక్ష సభ్యులు వ్యవహారిస్తున్నారన్న చీఫ్ విప్ వ్యాఖ్యలు సభలో ఉద్రిక్తతకు కారణమయ్యాయి.
దీంతో ఆగ్రహించిన విపక్ష సభ్యులంతా స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కంటూ గట్టిగా నినదించారు. పోడియం దగ్గర మార్షల్స్ విపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలతో మార్షల్స్ దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో స్పీకర్ సభను 10 నిమిషాలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
వాయిదా అనంతరం సభ ప్రారంభం అయిన తర్వాత కూడా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తమ పట్టు వీడలేదు. హోదాపై చర్చించాల్సిందేనంటూ ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ఈ సందర్భంగా మరోసారి తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను మరో 15 నిమిషాలు వాయిదా వేశారు. ఆ తర్వాత సమావేశాలు మొదలైనా.. చర్చపై వైఎస్ఆర్ సీపీ సభ్యులు ఉడుంపట్టు పట్టారు. దీంతో సభాలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సమావేశాలను శనివారానికి వాయిదా వేశారు.