ఏపీ వరద నష్టాలపై పరిహారానికి క్లెయిమ్‌లు
ముంబై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద నష్టాలకు సంబంధించి పరిహారం కోరుతూ జనరల్ బీమా కంపెనీలకు క్లెయిమ్ దరఖాస్తుల వెల్లువ మొదలైంది. సెప్టెంబర్ నెల చివర్లో వచ్చిన వరదలకు సంబంధించి సుమారు రూ.300 కోట్ల పరిహారం మేరకు క్లెయిమ్ దరఖాస్తులు రావచ్చని అంచనా వేస్తున్నట్టు ప్రభుత్వ రంగ జనరల్ బీమా కంపెనీల అసోసియేషన్ (జిప్సా) మీడియాకు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో వరదలకు సంబంధించి రూ.15కోట్ల మేర తాము పరిహారం రూపంలో చెల్లించాల్సి రావచ్చని ప్రభుత్వ రంగ అతిపెద్ద జనరల్ బీమా కంపెనీ న్యూఇండియా అస్యూరెన్స్ చైర్మన్ జీ శ్రీనివాసన్ చెప్పారు. పరిహారం వేగంగా చెల్లించేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది.
పరిహారం చెల్లింపునకు ఎస్‌బీఐ చర్యలు: ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇప్పటి వరకు పరిహారం కోరుతూ 23 దరఖాస్తులు వచ్చాయి. రూ.2.68 కోట్ల నష్టాలకు సంబంధించిన క్లెయిమ్స్‌ను అందుకున్నామని ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ హెడ్ పంకజ్ వర్మ చెప్పారు. వీటిని పరిష్కరించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. విపత్తు స్వభావాన్ని అంచనా వేసిన మీదట డాక్యుమెంటేషన్ మార్గదర్శకాలను సులభతరం చేశామని చెప్పారు. పరిహార చెల్లింపును వేగవంతం చేసేందుకు వీలుగా తమ బృందాలు ఇప్పటికే వరద నష్టాల అంచనా సర్వేను పూర్తి చేశాయన్నారు. ప్రత్యేక నైపుణ్య బృం దం, స్వతంత్ర సర్వేయర్లతో కూడిన ప్యానల్‌ను హైదరాబాద్‌లో ఉంచామని పాలసీదారులకు సాయ మందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వర్మ తెలిపారు.