మన పోస్టు భలే స్పీడ్
దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి
పోస్టల్ చరిత్రలో తొలిసారి లాభం రుచి చూసే అరుదైన అవకాశం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి లోటు మాయమయ్యే అవకాశం
అత్యధిక ఆదాయం పొందిన రెండో సర్కిల్
మహారాష్ట్రను నెట్టి తొలిస్థానం దిశగా అడుగులు
6 కోట్లను మించిన పొదుపు ఖాతాలు
సాక్షి, హైదరాబాద్
పోస్టల్ శాఖ చరిత్రలో తొలిసారి ‘లాభా’న్ని ఆర్జించే అవకాశం కనిపిస్తోంది. అది కూడా తెలుగు రాష్ట్రాలకు సంయుక్తంగా ఉన్న ఏపీ సర్కిల్ పరిధిలోనే చోటుచేసుకునే అవకాశం కలిగింది. ప్రస్తుత ఊపు అదే వేగంతో సాగితే దేశంలో తొలిసారి తపాలాశాఖ లాభాన్ని కళ్లజూడనుంది. సెల్‌ఫోన్లు, ఈమెయిళ్లతో ‘ఉత్తరం’ కనుమరుగయ్యాక తపాలాశాఖ మనుగడే ప్రశ్నార్థకమయింది. ఈ తరుణంలో ఏపీ సర్కిల్(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధి) దాన్ని సవాల్‌గా తీసుకుని వినూత్న పద్ధతులను అవలంబిస్తూ మొత్తం తపాలా శాఖకే మార్గదర్శిగా మారింది. నాలుగేళ్ల కిందటిదాకా తపాలా శాఖ ఆదాయంలో ఏపీ సర్కిల్ వాటా 1.65 శాతంగా ఉండగా ఇపుడది ఏకంగా 11 శాతానికి చేరింది.
ఇది దేశంలో రెండో స్థానం. తొలిస్థానం 14% వాటాతో ముంబైతో కలిసిన మహారాష్ట్రది. కాకపోతే అక్కడ ఆదాయంతో పాటు ఖర్చులూ ఎక్కువే. రెవెన్యూ లోటూ ఎక్కువే. ఏపీ సర్కిల్ విషయానికొస్తే 2013-14లో ఏకంగా రూ.144 కోట్ల లోటును పూడ్చుకుని, గతేడాదికి దాన్ని రూ.121 కోట్లకు పరిమితం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి లాభాల్లోకి మళ్లనున్నట్లు తపాలాశాఖ అంచనా వేస్తోంది. ఏపీ సర్కిల్ అనూహ్య ఫలితాలు ఏకంగా ప్రధాని మోదీని సైతం ఆకట్టుకున్నాయి. ఏపీ సర్కిల్ అనుసరిస్తున్న విధానాలను ఇతర సర్కిళ్లకు మార్గదర్శనంగా మార్చటం కోసం భారత తపాలా పాలకమండలిలో మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది.
భారీగా పెరిగిన సేవింగ్స్ ఖాతాలే కారణం!
ఉత్తరాలకు కాలం చెల్లుతుండటంతో త పాలాశాఖ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. పొదుపు ఖాతాలను పెంచుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవటంతో పాటు కొరియర్ సంస్థలతో పోటీపడుతూ వినూత్న సేవలు ఆరంభించింది. ప్రత్యేకంగా లాజిస్టిక్ విభాగాన్ని ప్రారంభించి అనతికాలంలోనే దాన్ని బలోపేతం చేసింది. దాన్నుంచి భారీ ఆదాయాన్ని పొందుతోంది.
చివరికి ఇల్లు ఖాళీ చేస్తే సామగ్రిని కొత్త ఇంటికి మార్చేందుకు కూడా తపాలా శాఖ వాహనాలు సిద్ధమయ్యాయి. దీంతోపాటు ఇటీవల సేవింగ్స్ ఖాతాలు బాగా పెరిగాయి. 2012-13లో 3.64 కోట్ల ఖాతాలుంటే 2013-14కు 4.45 కోట్లకు, 2014-15 కు 6.02 కోట్లకు చేరాయి. ఒక్కో వ్యక్తికి వివిధ రకాలైన నాలుగైదు ఖాతాలుండటంతో ఈ సంఖ్య భారీగా పెరిగింది. ప్రతి ఖాతాకూ రూ.199 చొప్పున కేంద్రం చెల్లిస్తోంది. దాంతో ఆదాయమూ పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రైవేటు కొరియర్ సంస్థల సగటు వృద్ధి 12-15 శాతంగా ఉంటే గత ఆర్థిక సంవత్సరంలో ఏపీ తపాలా సర్కిల్‌లో వృద్ధి 27 శాతంగా నమోదైంది. అది ఈ ఆర్థిక సంవత్సరంలో 30 శాతానికి చేరుతుందని అంచనా. ప్రస్తుతం ఏపీ సర్కిల్ పరిధిలో రూ.22,737 కోట్ల డిపాజిట్లున్నాయి.
స్పీడ్ పోస్ట్ ఇక ఇంటి నుంచే: స్పీడ్‌పోస్ట్ కోసం ఇక పోస్టాఫీసుకు వెళ్లనక్కరలేదు. నిర్ధారిత నంబర్‌కు ఓ ఎస్సెమ్మెస్ చేస్తే జీపీఎస్ ద్వారా అది స్థానిక పోస్టాఫీసుకు చేరుకుంటుంది. నిమిషాల వ్యవధిలో సిబ్బంది ఇంటికే వచ్చి పార్శిల్ తీసుకెళ్తారు. దేశంలో తొలిసారి పిక్‌పోస్ట్ పేరిట త్వరలో ఇది ఏపీ సర్కిల్‌లో మొదలు కానుంది. పోస్టల్ ఈ-షాప్ పేరుతో కోరిన వస్తువుల్ని ఇంటికే బట్వాడా చేసే విధానాన్నీ మొ దలు పెడుతున్నారు. ఆకాశవాణిలో ఆణిముత్యాల్లాంటి పాత ప్రసారా ల సీడీలు, టీటీడీ ప్రసాదం, లేపాక్షి ఉత్పత్తులు, తెలుగు యూనివర్సిటీ ప్రచురణలు, నిర్మల్ బొమ్మలు... ఇలా కొన్నింటిని తమ వెబ్‌సైట్ ద్వారా విక్రయించడానికీ ఏపీ సర్కిల్ ప్రయత్నిస్తోంది.
అందరి సమష్టి కృషి
పొదుపు ఖాతాలను భారీగా పెంచటంతో పాటు వినూత్న ఆలోచనలను అమలు చేయటంతో దేశంలోనే వేగంగా లాభాల బాట పట్టేందుకు అనువైన వాతావరణం ఏర్పడింది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే భారత తపాలా చరిత్రలో తొలిసారి లాభాలు అందుకుంటాం. ఈ ఘనతకు చేరువవటానికి మా ప్రతి ఉద్యోగి శ్రమే కారణం. మరింత నాణ్యమైన సేవలను ప్రజల ముందుంచి తపాలా విజయవంతంగా మనగలదని నిరూపిస్తాం.
- సుధాకర్, చీఫ్‌పోస్ట్‌మాస్టర్ జనరల్