మీ వల్లే అంతా.. ఒవైసీపై మండిపాటు
నాందేడ్: ఎంఐఎం పార్టీకి హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లోనే గాక మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఆదరణ ఉంది. ముఖ్యంగా మైనార్టీలు ఆ పార్టీకి అండగా ఉంటున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం చూపించింది. కాగా ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎంకు చేదు అనుభవం ఎదురైంది. ఆ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. అంతేగాక ఎంఐఎం వల్ల ముస్లిం ఓటు బ్యాంక్ చీలి, బీజేపీకి లబ్ధి కలిగిందని ముస్లింలు మండిపడుతున్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్‌లో ముస్లింలు.. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీపై నిరసన వ్యక్తం చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. యూపీలో ఎంఐఎం పోటీ చేసి ముస్లిం ఓట్లను చీల్చిందని, దీని వల్ల మైనార్టీ అభ్యర్థులు ఓడిపోయి బీజేపీ లాభపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం, ఒవైసీలకు వ్యతిరేకంగా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఒవైసీ దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ, దహనం చేశారు.