జీఎస్‌టీతో ఆర్థిక స్వేచ్ఛ: అనిల్ అంబానీ
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలులో భారత్‌కు ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుందని పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ గురువారం పేర్కొన్నారు. జూలై 1వ తేదీ నుంచీ అమల్లోకి రానున్న ఈ పరోక్ష పన్ను విధానం– దేశంలో అతిపెద్ద స్వేచ్ఛా, పారదర్శక మార్కెట్‌ను సృష్టిస్తుందని అన్నారు.
ఇక్కడ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ప్రతినిధులు నిర్వహించిన ఒక కార్యక్రమంలో రియలన్స్ గ్రూప్ చైర్మన్ మాట్లాడుతూ, తాజా పన్ను విధానం వల్ల దేశానికి పలు విధాలుగా ఉపయోగం కలుగుతుందని అన్నారు. ఒక దేశ చరిత్ర ఆర్థికవృద్ధికి దారితీసే క్షణాలు అరుదుగా వస్తాయని, జూన్ 30 అర్ధరాత్రి అటువంటి క్షణాల ముందు నుంచున్న మనం ఇందుకు ఎంతో గర్వపడాల్సి ఉంటుందని అంబానీ అన్నారు.