పట్టిసీమలో మరో వింత డిజైన్ | Another strange design of pattiseema | Sakshi
Sakshi News home page

పట్టిసీమలో మరో వింత డిజైన్

Published Sat, Aug 8 2015 2:20 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

పట్టిసీమలో మరో వింత డిజైన్

పట్టిసీమలో మరో వింత డిజైన్

ఏడాదిలో పూర్తిచేసుకునేందుకు పనులు కుదింపు
అందుకోసమే డిజైన్ మార్పు.. అదనంగా రూ.250 కోట్లు ఖర్చు
‘మార్చిన డిజైన్’కు ప్రభుత్వ అనుమతులు లేకుండానే పనులు పూర్తి
అనుమానాలున్నాయన్న మంజూరు కమిటీ
డిజైన్ మార్చడం వల్ల రూ.260 కోట్లు ఖర్చు తగ్గాల్సి ఉండగా,
అదనంగా రూ.250 కోట్లు కొట్టేసే వ్యూహం


హైదరాబాద్: ఆధునిక పరిజ్ఞానం పేరిట అదనంగా రూ.250 కోట్లు కొట్టేయడానికి పట్టిసీమ ప్రాజెక్టు కాంట్రాక్టర్, ప్రభుత్వ పెద్దలు కలిసి వ్యూహం రూపొందించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని వాస్తవ ఖర్చు కంటే భారీగా నిర్ణయించడం, అంచనా వ్యయంపై 21.9శాతం అధికంగా చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించిన అంశంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. దాని మీద అదనంగా రూ.250కోట్లు కొట్టేయడానికి తాజాగా ‘అత్యాధునిక పరిజ్ఞానం’ అనే అంశాన్ని తెర మీదకు తెచ్చారు. గోదావరి నుంచి 8,500 క్యూసెక్కుల నీటిని తోడి పోలవరం కుడికాల్వలో పోయడానికి వీలుగా 30 మోటార్లు, 15 వరుసల పైపులైన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం, కాంట్రాక్టు సంస్థ మెగా మధ్య ఒప్పందం కుదిరింది. ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్)విధానంలో ప్రాథమిక అంశాల్లో మార్పు చేయకుండా డిజైన్ మార్చుకొనే స్వేచ్ఛ కాంట్రాక్టు సంస్థకు ఉంటుంది. అంచనా వ్యయానికి మించి చేసే అదనపు ఖర్చును ప్రభుత్వం చెల్లించదు. ఈ విషయం ఒప్పందంలోనూ  ఉంది.పనులు ప్రారంభానికి ముందే డిజైన్‌ను  సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ నుంచి ఆమోదం పొందాలనే నియమం ఉంది. ఇందుకు భిన్నంగా పనులన్నీ పూర్తి చేసి డిజైన్‌ను ప్రభుత్వానికి పంపించింది. ఈపీసీ  నిబంధనలను నెట్టి అంచనా వ్యయాన్ని మించి అదనంగా రూ.250 కోట్లు చెల్లించాలని ప్రతిపాదించింది.

 డిజైన్ మార్చాల్సిన అవసరం ఏమిటో?
 పనులు చేసే సమయంలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి డిజైన్‌లో మార్పులు చేయడం సహజం. కానీ ఒప్పందం మీద సంతకాలు చేసిన వెంటనే.. కొత్త డిజైన్ మేరకు పనులు ప్రారంభం కావడం గమనార్హం. ఇలా రూ.కోట్లు కొల్లగొట్టే వ్యూహం  ఇరు పక్షాలకు తెలుసు. అందుకే.. మార్చిన డిజైన్‌కు ఆమోదం లేకుండానే పనులు చేసేశారు. చివరి దశలో డిజైన్ ఆమోదానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చారు. ఎందుకు మార్చాల్సి వచ్చిందనేది చెప్పకపోవడం గమనార్హం. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వల్ల మోటార్లు-పంపుల సంఖ్య 30 నుంచి 24కు తగ్గాయని చెప్పారు. కాంట్రాక్టర్ చెబుతున్న ఆధునిక పరిజ్ఞానానికి, ఒప్పందంలో పేర్కొన్న పరిజ్ఞానానికి వ్యత్యాసమేమిటో అధికారులు తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. పంపుల సంఖ్య తగ్గితే వ్యయం తగ్గాల్సి ఉండగా, పెరుగుతుందంటూ కాంట్రాక్టు చేసిన ప్రతిపాదనకు తలాడించడం గమనార్హం.

 నిబంధనలకు విరుద్ధమన్న ఎస్‌ఎల్‌ఎస్‌సీ
 సర్కారు పెద్దల అండదండలతో ముందే రూపొందించుకున్న వ్యూహం మేరకు మారిన డిజైన్, ఫలితంగా అదనంగా రూ.250 కోట్లు చెల్లించాలన్న ప్రతిపాదన మీద నేరుగా సంతకాలు చేయడానికి అధికారులకు ధైర్యం సరిపోయినట్టులేదు. రాష్ట్రస్థాయి మంజూరు కమిటీఆమోదముద్రకు ప్రయత్నిం చారు. గురువారం రాత్రి వరకు చర్చించిన కమిటీ... కాంట్రాక్టర్ చెబుతున్న ఆధునిక పరిజ్ఞానం నమ్మశక్యంగా లేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అదనంగా చెల్లించాలని కోరుతున్న రూ.250 కోట్లలో రూ.190 కోట్ల విలువైన ‘కాంపోనెంట్స్’ గురించి నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు కనీస అవగాహన లేదని, వాటి ధరలపైనా అనుమానాలున్నాయంది. మారిన డిజైన్‌కు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ ఆమోదం తెలిపినట్లుగా నీటిపారుదల శాఖ అధికారులు సమావేశంలో వివరించారు. డిజైన్ మారడం వల్ల వ్యయం పెరుగుతుందంటూ పోలవరం సీఈ రాసిన లేఖలో ఎక్కడా.. మారిన డిజైన్‌కు ఆమోదం తెలిపారనే అంశం లేదు. ఆమోదం తెలిపిన లేఖా లేదు. డిజైన్‌కు ఆమోదం లేకుండానే పనులు ఎలా చేశారనే ప్రశ్న రావడంతో.. పాత తేదీలతో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈతో ఆమోదముద్ర వేయించడానికి ఉన్నతాధికారులు హడావుడి పడుతున్నారు.

 బోర్డు ఆమోదముద్ర వేయిస్తే సరి..
 ఎస్‌ఎల్‌ఎస్‌సీలో ఊహించని అభిప్రాయం వ్యక్తంకావడంతో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, సర్కారు పెద్దలు ప్రత్యామ్నాయ మా ర్గాలను అన్వేషించారు. ఆధునిక పరిజ్ఞానం, ఎస్‌ఎస్‌ఆర్(స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్) జాబితా లో లేని అంశాల ధరల నిర్ధారణకు ‘బోర్డ్ ఆఫ్ సీఈస్’(చీఫ్ ఇంజనీర్ల బోర్డు) భేటీ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడూ ఈ భేటీ ఏర్పాటు చేసి ‘మమ’ అనిపించాలని శుక్రవారం నిర్ణయించా రు. సోమవారం భేటీ ఏర్పాటు చేసి, అక్కడే వారికి పత్రాలు ఇచ్చి ఆమోదముద్ర వేయిస్తామని.. పట్టిసీమ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఇంజనీర్ ‘సాక్షి’కి చెప్పారు. ఆమోదముద్ర పడిన మరుక్షణం అదనపు చెల్లింపులు చేయడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు.
 
రూ.500 కోట్లకు పైగా కొట్టేసే వ్యూహం
 మోటార్లు-పంపుల సంఖ్య 30 నుంచి 24కు, పైపుల లైన్ల సంఖ్య 15 నుంచి 12కు తగ్గించడం వల్ల రూ.260 కోట్ల వ్యయం తగ్గుతుందని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఈ రూ.260 కోట్లు, ఆధునిక పరిజ్ఞానం పేరిట అదనంగా అడుగుతున్న రూ.250 కోట్లు కలిపి.. మొత్తం రూ.500 కోట్లు కొల్లగొట్టేసే వ్యూహాన్ని సర్కారు పెద్దల అండదండలతో అమలవుతోందని స్పష్టంగా తెలిసిపోతోంది.
 
 దోపిడీ కొనసాగింపునకే కొత్త నాటకం

 పట్టిసీమ పథకంలో అన్నీ అడ్డగోలు వ్యవహారాలే. ఈపీసీ నిబంధనల ప్రకారం 5 శాతానికి మించి బిడ్లు దాఖలైతే రద్దు చేయాలి. 21.9% అధికానికి టెండర్లు ఖరారు చేయడంపై శాసనసభ లోపల, వెలుపల విమర్శలు రావడంతో.. ఏడాదిలో పూర్తి చేస్తేనే 21.9% అధికంగా చెల్లిస్తామని, లేదంటే 5 శాతమేనని కొత్త పల్లవి అందుకొన్న విషయం విదితమే. ఏడాదిలో పూర్తి చేయాలని టెండర్లు పిలిచి, ఇచ్చిన గడువులో పూర్తి చేస్తే 5 శాతంతోపాటు మరో 16.9% అదనంగా చెల్లిస్తామంటూ నిబంధనలను తుంగలో తొక్కినప్పుడే గూడుపుఠాని వెల్లడయింది. ఒప్పందం ప్రకారం చేస్తే ఏడాదిలో పూర్తవుతుందో, లేదో అనే అనుమానం రావడంతో కాంట్రాక్టర్-ప్రభుత్వం కలిసి కొత్త నాటకం మొదలుపెట్టాయి. మోటార్లు-పంపులు, పైపులైన్ల సంఖ్య తగ్గించి గడువులోగా పూర్తి చేసి సొమ్ము చేసుకోవాలని వ్యూహం పన్నాయి. మోటార్లు-పంపులు, పైపులైన్ల సంఖ్య తగ్గినప్పుడు ప్రాజెక్టు పూర్తి చేయడానికి పట్టే సమయం, వ్యయం రెండూ తగ్గాలి. కానీ అందుకు భిన్నంగా.. వ్యయాన్ని పెంచడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement