గత 25 రోజుల్లో ఐదుకు చేరిన మృతుల సంఖ్య
మరోవైపు విజృంభిస్తున్న డెంగీ, మలేరియా
సాక్షి, హైదరాబాద్: నగరంలో స్వైన్‌ఫ్లూ మళ్లీ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఫ్లూతో బాధపడుతూ చికిత్స కోసం ఇటీవల గాంధీ ఆస్పత్రిలో చేరిన అనంతపురం జిల్లా రాప్తాడు మండలం చిన్మయనగర్‌కు చెందిన మహిళ(23), రంగారెడ్డి జిల్లా నేరేడ్‌మెట్‌కు చెందిన వ్యక్తి(49) బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆగస్టు 29 నుంచి ఇప్పటి వరకు గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితుల సంఖ్య ఐదుకు చేరింది.
ప్రస్తుతం ఆస్పత్రి స్వైన్‌ఫ్లూ వార్డులో ఇద్దరు చిన్నారులతో సహా 9 మంది పాజిటివ్ బాధితులు, డిజాస్టర్ వార్డులో మరో 8 మంది ఫ్లూ అనుమానితులు చికిత్స పొందుతున్నారు. యశోద, కేర్, కిమ్స్, అపోలో, పౌలోమి, రెయిన్‌బో, ఆదిత్య, అవేర్ గ్లోబల్, కాంటినెంటల్ ఆస్పత్రుల్లో మరో 30 మంది చికిత్స పొందుతున్నారు.
మూడు రోజుల్లో 30 కేసులు...
గత మూడు రోజుల్లో 131 మంది బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్ష కోసం ఐపీఎంకు పంపగా, 30 మందికి హెచ్1ఎన్1 పాజిటివ్‌గా నిర్ధారణైంది. బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేసినా ప్రస్తుతం ఒక్క గాంధీలోనే వైద్య సేవలు అందుతున్నాయి.
98 డెంగీ కేసులు...
స్వైన్‌ఫ్లూతో పాటు డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం సెప్టెంబర్‌లోనే 98 డెంగీ, 28పైగా మలేరియా కేసులు నమోదు కావడం గమనార్హం.
స్వైన్‌ఫ్లూతో మరో ఇద్దరు మృతి
Published Fri, Sep 25 2015 2:52 AM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM
Advertisement
Advertisement