
రోశమ్మ (ఫైల్ ఫొటో)
ఒక పోరాటం ముగిసింది. రోశమ్మ చనిపోయింది. జనం వెతల నుంచి పుట్టుకొచ్చే ఉద్యమాలకు సిద్ధాంతాలతో పనిలేదని రుజువుచేసింది. కష్టపడి సాధించుకున్న మద్యరహిత సమాజం.. మళ్లీ 'మందు' బాట పట్టడమూ చూసింది. బాధపడిండి. ఇప్పుడు శాశ్వత నిద్రలోకి జారుకుంది. మందుబాబుల చేతిలో రమ్య లాంటి చిన్నారులు చనిపోతున్న తరుణంలో.. రోశమ్మ మళ్లీ పుట్టాలని కోరుకోవడం అవసరమేమో!
► కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఉద్యమనేత
► తీవ్ర అస్వస్థతతో ఆదివారం ఉదయం తుదిశ్వాస
► దూబగుంటలో సారా వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం
► ఆ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించిన ఉద్యమం
నెల్లూరు: సారా వ్యతిరేక ఉద్యమకారిణి దూబగుంట రోశమ్మ ఆదివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పు దూబగుంటలో కన్నుమూశారు. ఆమె వయసు 93 సంవత్సరాలు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో వైద్యానికి దూరమయ్యారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు దూబగుంటలో సోమవారం ఉదయం 10 గంటలకు జరుగుతాయి.
మద్యనిషేధ ఉద్యమ రూపకర్త
1990ల్లో సారా వ్యతిరేక ఉద్యమం ఉప్పెనగా మారడానికి రోశమ్మే కారణం. నెల్లూరు జిల్లాలోని దూబగుంట నుంచి ఆమె 1992లో పూరించిన సారా వ్యతిరేక ఉద్యమ శంఖం తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించింది. ఈ క్రమంలో ఆమెకెన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. సారా మాఫియా ఆగడాలు, పోలీసు కేసులు, పెద్దల బెదిరింపులెన్నింటినో తట్టుకుని ఉద్యమంలో ముందుకుసాగారు. జిల్లాలోనేగాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చారు. 1994నాటి ఎన్నికల సందర్భంగా టీడీపీ అధికారంలోకొస్తే సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తానని ఆనాటి టీడీపీ అధినేత ఎన్టీఆర్ ప్రకటించడానికి రోశమ్మ ఉద్యమమే ప్రధాన కారణం. ఇచ్చినమాట ప్రకారం 1995 జూన్ 1నుంచి సంపూర్ణ మద్యనిషేధం అమలుచేస్తున్నట్లుగా ప్రకటిస్తూ ఎన్టీఆర్ తొలి సంతకం చేశారు. ఈ నిషేధం 1997 మార్చి వరకు కొనసాగింది. చంద్రబాబు అధికారపగ్గాలు చేపట్టాక మద్యనిషేధాన్ని ఎత్తివేశారు. దీనిపై ఆమె పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నుంచి అందని సాయం
రోశమ్మది నిరుపేద కుటుంబం. ప్రభుత్వం నుంచి ఆమెకెలాంటి సాయమందలేదు. కావలి వెంగళరావునగర్‌లో రూ.లక్ష అప్పుచేసి కట్టుకున్న సొంత ఇంటినిసైతం అభివృద్ధి పేరుతో పాలకు లు కూల్చివేశారు. కనీసం ప్రత్యామ్నాయం చూపలేదు. ఈ నేపథ్యంలో ఇంటికోసం చేసిన అప్పు తీర్చుకోలేక ఆమె తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వృద్ధాప్య పింఛన్‌నుసైతం కొన్నాళ్లపాటు ఆపేశారు. ఆ తర్వాత పునరుద్ధరించారు. ఇక అవసాన దశలో ఆమె పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఆమెకు బతుకుభారంగా మారింది. ప్రభుత్వం నుంచి ఏ సాయం అందలేదు. కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న ఆమెకు అన్నివిధాలా సహాయ సహకారాలందిస్తామని చెప్పిన ప్రభుత్వం.. కంటితుడుపు చర్యగా కొద్దికాలం డయాలసిస్ చేయించి వదిలేసింది. సరైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆమె మృత్యువుకు దగ్గరైంది.
మహిళాలోకం నడుంబిగిస్తే ప్రభుత్వాలు దిగిరాక తప్పదని నిరూపించారు
దూబగుంట రోశమ్మ మృతికి జగన్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: సారా వ్యతిరేక ఉద్యమకారిణి దూబగుంట రోశమ్మ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మద్యం మహమ్మారి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నవేళ మహిళాలోకం నడుం బిగిస్తే ప్రభుత్వాలు దిగిరాక తప్పదని రోశమ్మ పోరాటం నిరూపించిందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణ మద్యనిషేధాన్ని కోరుతూ నెల్లూరు జిల్లా దూబగుంటలో రోశమ్మ 1990 ప్రాంతంలో ప్రారంభించిన మహోద్యమం తెలుగుజాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైన అధ్యాయమన్నారు. ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టే మహోద్యమాలను గ్రామాల నుంచి నిర్మించవచ్చని ఆమె నిరూపించార న్నారు. రోశమ్మకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నానని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
ఆదర్శప్రాయురాలు: వెంకయ్యనాయుడు
సాక్షి, విజయవాడ/అమరావతి: రోశమ్మ మృతికి కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. రోశమ్మ మహిళాలోకానికే ఆదర్శప్రాయురాలని ఆయన ఒక ప్రకటనలో కొనియాడారు. ఆమె మృతి పట్ల తీవ్ర విచారం వెలిబుచ్చారు.