వరంగల్‌లో విషాదం: గొడవపడి.. కిటికీ నుంచి కిందపడి.. | Telangana: Student Pushed Off College Building By Classmate In Warangal District | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో విషాదం: గొడవపడి.. కిటికీ నుంచి కిందపడి..

Published Sun, Sep 26 2021 2:59 AM | Last Updated on Sun, Sep 26 2021 1:26 PM

Telangana: Student Pushed Off College Building By Classmate In Warangal District - Sakshi

సంజయ్‌ (ఫైల్‌) 

సాక్షి, వరంగల్‌/ నర్సంపేట: స్లైడ్‌ విండో పగులగొట్టిన ఘటనలో కాలేజీ యజమాన్యానికి జరిమానా కట్టాలన్న విషయంలో నలుగురు విద్యార్థుల మధ్య తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణాలు తీసింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లా నర్సంపేట పోలీ స్‌స్టేషన్‌ పరిధిలోని బిట్స్‌ కాలేజీ క్యాంపస్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. తీవ్రగాయాలైన విద్యార్థి సంజయ్‌ (18) ఆస్పత్రిలో అదేరోజు రాత్రి కన్నుమూశాడు. ఈ కేసులో విద్యార్థులు రాయపురపు హరి రాజు, గుండబాటు శివసాయి, ఎల్‌.మనోహర్, పెద్దబోయిన కృష్ణంరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూ డు రోజులక్రితం కిటికీ అద్దం పగిలినా మరమ్మతులు చేయని బిట్స్‌ చైర్మన్‌ రాజేంద్రప్రసాద్‌రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు.  

జరిమానా గలాటాకు దారితీసి.. 
హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం వంగపల్లికి చెందిన భాస్కర్, కవితలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సంజయ్‌ నర్సంపేటలోని బిట్స్‌ కాలేజీలో పాలి టెక్నిక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల కా లేజీ తెరవడంతో ఈనెల 20న హాస్టల్‌కు వచ్చాడు. హరిరా జు, శివసాయి, మనోహర్, కృష్ణంరాజుతో కలిసి హాస్టల్‌ బ్లాక్‌లోని రెండో అంతస్తులోని 218 గదిలో ఉంటున్నాడు. మంగళవారం ఓ విద్యార్థి కారణంగా ఆ గదిలో స్లైడ్‌ విండో పగిలింది. దీంతో కాలేజీ యాజమాన్యానికి దాదాపు రూ. 15వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుందని సంబంధిత సిబ్బంది ఈ విద్యార్థులను హెచ్చరించారు.

శుక్రవారం రాత్రి 7.50 గంటలకు భోజనం చేస్తున్న సమయంలో ఎవరు జరిమానా కట్టాలన్న చర్చ రావడంతో విద్యార్థుల మధ్య వాగ్వా దం జరిగింది. ఈ సమయంలోనే వారిని వారించబోయిన సంజయ్‌ని గట్టిగా తోసేశారు. దీంతో సంజయ్‌ 25 ఫీట్ల ఎత్తులో ఉన్న తమ గది నుంచి కింద పడ్డాడు. కింద సిమెంట్‌ గద్దె ఉండటం వల్ల తలతో పాటు వెన్నెముకకు బలంగా గాయాలయ్యాయి. రాత్రి 8.15కు షాక్‌ నుంచి తేరుకున్న విద్యార్థులు వార్డెన్‌కు సమాచారం అందించారు. వార్డెన్‌ వెంటనే సంజయ్‌ను నర్సంపేట సమీప ఆస్పత్రిలో ప్రాథ మిక చికిత్స అనంతరం, ములుగురోడ్డులోని అజర ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో సంజయ్‌ మృతిచెందాడు. అప్పటికే సమాచారం అందుకున్న తండ్రి భాస్కర్‌ ఆస్పత్రిలో విగతజీవిగా మారిన కొడుకును చూసి కన్నీరు మున్నీరయ్యారు. తన కుమారుడు మృతికి కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతోపాటు ఆ నలుగురు విద్యార్థులు కారణమని నర్సంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంజయ్‌ మృతదేహానికి ఎంజీఎంలో పోస్టుమార్టం నిర్వహించారు. 

కొట్టి చంపేశారు.. 
పదిరోజులు ఇంటినుంచే కాలేజీకి పోయి వచ్చిండు. అందులో ఉన్న నలుగురే అద్దం పగులగొట్టిండ్రు. వార్డెన్‌ కూడా నలుగురే జరిమానా కట్టాలన్నాడు. అయితే మా కుమారుడు కూడా జరిమానా కట్టాలని మిగిలిన విద్యార్థులు ఒత్తిడి తెచ్చిండ్రు. నేనెందుకు కడతనని సంజయ్‌ అనడంతోనే పిడిగుద్దులు గుద్దారు. కొట్టి చంపినంకనే కిటికీ నుంచి కిందపడేసిండ్రు. 
– కవిత, మృతుడు సంజయ్‌ తల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement