మధు
దేవరకొండ: మెడకు చుట్టుకున్న చున్నీ ఓ బాలుడి ప్రాణం తీసింది. నల్లగొండ జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొండమల్లేపల్లి మండలం గాజీనగర్ గ్రామానికి చెందిన పేట జానీ, రాణి దంపతులు గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం గ్రామంలోని తమ చేను వద్ద దంపతులు వేరుశనగ (పల్లీ) కోత మెషీన్ తీసుకొచ్చి కాయలను వేరు చేస్తున్నారు.
అక్కడే ఆడుకుంటున్న వారి చిన్న కుమారుడు మధు(9) మెడలో ఉన్న చున్నీ ప్రమాదవశాత్తు పల్లీ కోత మెషీన్ ఫ్యాన్‌కు చుట్టుకుంది. దీంతో ఫ్యాన్ రెక్క బాలుడి మెడకు తాకడంతో తల తెగిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కళ్లెదుటే కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి జానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ నారాయణరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment