శరత్, యశ్వంత్, నవదీప్
ధర్మపురి: ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చెరువులో మునిగి మృతి చెందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో విషాదం నింపింది. గ్రామస్తులు, పోలీసులు అందించిన వివరాలివి.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామానికి చెందిన మారంపెల్లి శరత్ (12), నవదీప్ (12)తో పాటు నల్గొండ జిల్లా దోసారం గ్రామానికి చెందిన గొలుసుల యశ్వంత్ (13) ఆదివారం ఉదయం పాఠశాల పక్కనే ఉన్న చెరువులో ఈతకు వెళ్లారు.
గతేడాది మిషన్ కాకతీయ కింద చెరువులో మట్టి తీయడంతో నీటి లోతు తెలియలేదు. దీంతో చెరువులోకి దిగిన ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగిపోయారు. కొంత సమయం తర్వాత గ్రామస్తులకు చెరువు పక్కన చెప్పులు కనిపించడంతో ఆందోళనతో కేకలు వేశారు. సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు.. గ్రామస్తుల కేకలు విని మూడు మృతదేహాలను బయటికి తీశారు.
శరత్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి, యశ్వంత్ ఎంపీపీఎస్ పాఠశాలలో 4వ, తరగతి, నవదీప్ ధర్మపురిలోని కేరళ ఇంగ్లిష్ మీడియంలో 4వ తరగతి చదువుతున్నారు. బతుకుతెరువు కోసం నవదీప్ తండ్రి కిషన్ రెండేళ్ల క్రితం, శరత్ తండ్రి సత్తయ్య 10 నెలల క్రితం దుబాయ్ వెళ్లారు. యశ్వంత్ తల్లిదండ్రులు వారం క్రితం స్వగ్రామం నల్గొండ జిల్లాకు వెళ్లారు. ఈ సంఘటనతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు చెరువు వద్దకు తరలివచ్చి కంటతడి పెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment