
పరవాడ/కొత్తపల్లి (పిఠాపురం)/అన్నవరం (ప్రత్తిపాడు): సముద్రంలో మునిగి ఆదివారం నలుగురు మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. విశాఖ జిల్లాలో ముగ్గురు మృతిచెంది, ఒకరు గల్లంతు కాగా, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు మృతిచెంది, మరో ఇద్దరు గల్లంతయ్యారు. విశాఖ జిల్లా పరవాడ మండలంలోని పరవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008లో పదో తరగతి చదువుకున్న దాదాపు 120 మంది విద్యార్థులు ఆదివారం ఉదయం తిక్కవానిపాలెం తీరంలో కలుసుకున్నారు.
సాయంత్రం వరకు ఆడిపాడి సందడి చేశారు. అనంతరం ఇంటి ముఖం పట్టారు. అయితే వెన్నెలపాలెనికి చెందిన పైలా మహేష్ (28), మాసవరపు నరేష్ (27), సిరపరపు రామకృష్ణ (28), లాలం నరసింగరావు (27) సముద్ర స్నానానికి వెళ్లారు. కాస్త లోపలికి వెళ్లడంతో అలలు వారిని లాగేశాయి. మహేష్, నరేష్, రామకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలో ఒడ్డుకు కొట్టుకొచ్చారు. తోటి స్నేహితులు వెంటనే వారిని గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ముగ్గురూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గల్లంతైన మరో యువకుడు నరసింగరావు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
తూ.గో. జిల్లాలో నైజీరియన్ మృతి...
పెద్దాపురం మండలం సూరంపాలెంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే నైజీరియాకు చెందిన ఇమ్మానుయేలు ఒబెరా (21) ఆదివారం స్నేహితులతో కలిసి ఉప్పాడ బీచ్‌లో స్నానం చేస్తుండగా గల్లంతై మృతి చెందాడు. కాగా, తొండంగి మండలం దానావాయిపేటలో సముద్ర స్నానానికి దిగి కాకినాడ ఇంద్రపాలేనికి చెందిన సల్మాన్ మదీనా (17) గల్లంతయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment