దేవరాజుగట్టులో ఉన్న ఎన్‌ఎస్ హాస్టల్ అధికారి మహేష్ (ఫైల్) వివేక్‌చంద్ర (ఫైల్)
దేవరాజుగట్టు (పెద్దారవీడు): వారిద్దరూ మంచి స్నేహితులు.. ఒకే హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఏమైందో ఏమోగానీ రెండు రోజుల వ్యవధిలో ఇద్దరూ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ సంఘటన దేవరాజుగట్టు ఎన్‌ఎస్ (నాదెళ్ల సుబ్రహ్మణ్యం) బాలుర హాస్టల్‌లో వెలుగులోకి వచ్చింది. మార్కాపురం మండలం దరిమడుగు సమీపంలో ఎన్‌ఎస్ అగ్రికల్చర్ కళాశాలలో వివేక్‌చంద్ర, అధికారి మహేష్‌లు మొదటి సంవత్సరం బీఎస్సీ (ఏజీ) చదువుతున్నారు. మొత్తం హాస్టల్‌లో 45 మంది విద్యార్థులు ఉన్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు గ్రామానికి చెందిన అధికారి మహేష్ దేవరాజుగట్టులో ఎన్‌ఎస్ కళాశాల బాలుర హాస్టల్ ఉంటున్నాడు. సోమవారం రాత్రి ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. స్నేహితుడు వివేక్‌చంద్ర వెంటనే మహేష్‌ను మార్కాపురంలోని వినోద్ వైద్యశాలకు తరలించాడు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంగళవారం ఒంగోలు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మహేష్ (22) మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి కుమారుడి మృతదేహం చూసి కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని స్వగ్రామం తీసుకెళ్లారు.
అతడి స్నేహితుడు కూడా..
అధికారి మహేష్ స్నేహితుడు కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన వివేకచంద్ర (19) కూడా గురువారం రాత్రి అనారోగ్యానికి గురయ్యాడు. స్నేహితులు మార్కాపురంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున వివేక్‌చంద్ర మృతి చెందాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఒంగోలు వచ్చి అక్కడి నుంచి కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.
ఆందోళనలో విద్యార్థులు
ఒకే హాస్టల్లో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో మిగిలిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మృతుడు మహేష్ తండ్రి మధుసుదనాచారిని ఫోన్‌లో సంప్రదించగా తమ కుమారుడికి కడుపునొప్పి వచ్చిందని, మార్కాపురం వినోద్ వైద్యశాలలో రాత్రి 2.30 గంటలకు చేర్చారని, అప్పటి నుంచి 5.30 గంటల వరకు వైద్యం చేశారని చెప్పారు. డాక్టర్లు సరైన వైద్యం అందించలేదని ఆరోపించారు.
సహచర విద్యార్థులు తెల్లవారు జామున 5.30 గంటలకు ఫోన్ చేశారని చెప్పారు. సరైన చికిత్స అంది ఉంటే తమ కుమారుడు బతికి ఉండేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ స్పందించకపోవడమే కారణమని విద్యార్థులు మండిపడుతున్నారు. తమ కుమారుడి మృతికి కళాశాల యాజమాన్యం, హాస్టల్ వార్డెన్, వాచ్‌మన్‌లే కారణమని మధుసూదనాచారి ఆరోపించారు. ఈ ఘటనపై పుంగనూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. శనివారం పెద్దారవీడు పోలీసుస్టేషన్‌లో కూడా యాజమాన్యంపై ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. వివేక్‌చంద్ర తండ్రి సుబ్బారావుతో కూడా ఫోన్‌లో మాట్లాడగా ఆరోగ్యం బాగాలేదంటూ తమ కుమారుడిని మార్కాపురం వినోద్ వైద్యశాలకు సహచర విద్యార్థులు తరలించారన్నారు.
ముందు రోజు రాత్రి కూడా తమ కుమారుడు ఫోన్‌లో మూడు సార్లు మాట్లాడాడని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు కళాశాల సిబ్బంది ఫోన్ చేసి ఒంగోలులో కిమ్స్‌లో చేర్పించామని చెప్పారన్నారు. వెంటనే ఒంగోలుకు బయల్దేరి వచ్చే సరికి కుమారుడు మృతి చెంది ఉన్నాడని కన్నీటిపర్యంతమయ్యారు. తమ కుమారుడి మృతికి కారణాలు ఏమిటని కళాశాల సిబ్బందిని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పకుండా మాటలు దాటవేస్తున్నారని కన్నీరుమున్నీరయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment