ఇక ఎనీ టైం వాటర్ | Any time the water | Sakshi
Sakshi News home page

ఇక ఎనీ టైం వాటర్

Published Sat, Oct 3 2015 7:54 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM

ఇక ఎనీ టైం వాటర్ - Sakshi

ఇక ఎనీ టైం వాటర్

సాక్షి ప్రతినిధి, వరంగల్ : గ్రామాల పరిస్థితులు మారుతున్నాయి. సాంకేతిక శరవేగంగా పల్లెలకు చేరుతోంది. మనిషికి ప్రాణాధారమైన తాగునీటి సరఫరాలో ఏటీఎం తరహా సాంకేతిక పరిజ్ఞానం కొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. గ్రామీణులకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరాకు ఎనీ టైం వాటర్ (ఏటీడబ్ల్యూ) కేంద్రాలు వెలుస్తున్నాయి. 2012 ఏప్రిల్ 7న వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం వెంకటాపురంలో మొదలైన ఈ సరికొత్త సౌకర్యం... ఇప్పుడు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రల్లోని 351 గ్రామాలకు విస్తరించింది. సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలోనూ ఈ వ్యవస్థ ఉంది.

గ్రామీణ అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్న బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఈ ఏటీడబ్ల్యూలకు రూపకల్పన చేసింది. ‘నీటి శుద్ధీకరణ పథకం’ పేరుతో 702 తాగునీటి సరఫరా కేంద్రాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. సమష్టి స్ఫూర్తితో ఆదర్శంగా నిలిచిన వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో రూపాయికే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు ఈ ఏటీడబ్ల్యూ కేంద్రాలతో అందుతోంది. గంటకు వెయ్యి లీటర్ల నీటిని సరఫరా చేసేలా ప్లాంటును నిర్మించారు. ఏటీడబ్ల్యూ కేంద్రం స్థాపనకయ్యే ఖర్చు కోసం మొదట గ్రామంలోని 80 కుటుంబాలు వెయ్యి రూపాయల చొప్పున జమచేశాయి. బాల వికాస సంస్థ మిగతా మొత్తాన్ని, యంత్ర సామగ్రిని సమకూర్చింది. మెరుగైన సరఫరాతో ప్రస్తుతం గ్రామంలోని 283 కుటుంబాలు ఈ ఏటీడబ్ల్యూ కార్డుతో నీటిని పొందుతున్నాయి. రోజూ ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు మంచినీటి సరఫరా ఉంటుంది.

 కార్డు చూపితే చాలు..
 మంచినీటి ప్లాంటు వద్ద అమర్చిన మిషన్‌కు ఏటీడబ్ల్యూ కార్డును దగ్గరగా పెడితే 20 లీటర్ల మంచి నీరు వస్తుంది. ఇలా ఒకరి తర్వాత ఒకరు నీటిని తీసుకువెళతారు. ఏటీడబ్ల్యూ కార్డు కోసం ఏడాదికి రూ.360 చెల్లించాలి. ఈ లెక్కన రూపాయికే 20 లీటర్ల మంచినీరు లభిస్తోంది. అదనంగా అవసరమైతే రూ.4కు 20 లీటర్ల చొప్పున తీసుకునే వెసులుబాటు ఉంది. ఏటీడబ్ల్యూ కార్డులను ఏడాదికోసారి రీచార్జ్ చేస్తారు. ఎంత మేర వినియోగించుకున్నాం, కార్డులో ఎంత మొత్తం ఉందనేదానినీ యంత్రం వద్ద కార్డును ఉంచి తెలుసుకోవచ్చు.

 ఇబ్బందులను తొలగించేందుకు..
 బాల వికాస స్వచ్ఛంద సంస్థ 24 ఏళ్లుగా గ్రామాల్లో మంచినీటి సరఫరా పథకాలను అమలు చేస్తోంది. ఈ సంస్థ తొలుత ఏర్పాటు చేసిన తాగునీటి సరఫరా ప్లాంట్ల నిర్వహణలో సమస్యలను గుర్తించింది. ప్లాంట్ నిర్వహణకు ఇద్దరు ఆపరేటర్లను నియమించాల్సి రావడంతో నీటి ధర పెరిగేది. కొన్ని ప్లాంట్లలో పర్యవేక్షకులు ఉండకపోవడం, ఎవరెవరు ఎంత మంచినీటిని తీసుకెళుతున్నారో తెలియకపోవడం వంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో హైదరాబాద్‌కు చెందిన ఆల్ఫా ఎలక్ట్రానిక్ సిస్టమ్ సహాయంతో ఏటీడబ్ల్యూ విధానాన్ని బాల వికాస సంస్థ అమలుచేస్తోంది.
 
 స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం
 ‘‘స్వచ్ఛమైన తాగునీరు అందరికీ అందడమే లక్ష్యంగా మా సంస్థ పనిచేస్తోంది. ప్రస్తుతం 14 లక్షల మందికి తాగునీటిని సరఫరా చేస్తున్నాం. అందులో 8 లక్షల మంది ఏటీడబ్ల్యూ విధానంలో నీటిని పొందుతున్నారు. మిగతా ప్లాంట్లలోనూ కార్డు పద్ధతిలోకి మార్చుతున్నాం. హైదరాబాద్‌లోనూ 8 ప్లాంట్లను ఏర్పాటు చేశాం. పేదలకు తక్కువ ధరకు మంచినీటిని సరఫరా చేయడం ఏటీడబ్ల్యూ వల్ల కచ్చితంగా సాధ్యమవుతుంది..’’
 - సింగారెడ్డి శౌరిరెడ్డి, బాల వికాస ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్
 
 ఏటీడబ్ల్యూ ఒక వరం...
 ‘‘మా గ్రామంలో 1993లోనే బాల వికాస సహకారంతో తాగునీటి సరఫరా ట్యాంకు నిర్మించుకున్నాం. తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం. విద్యుత్ శాఖ అధికారులు మాకు సాధారణ కేటగిరీలోనే కరెంటు సరఫరా చేస్తున్నారు. దీని వల్ల రూపాయికే 20 లీటర్ల నీటిని సరఫరా చేయగలుగుతున్నాం. ఏటీడబ్ల్యూ నిజంగా వరమే..’’
 - పెండ్లి మల్లారెడ్డి, వాటర్ కమిటీ చైర్మన్, గంగదేవిపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement