♦ త్వరలోనే అందిస్తాం: హరీశ్
♦ కేటీఆర్ డైనమిక్ మినిస్టర్ అని ప్రశంస
హైదరాబాద్: హైదరాబాద్ నగర వాసులకు నిరంతరం తాగునీటిని అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఈ కల త్వరలోనే సాకారమవుతుందని భారీ నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. ఇందుకు సీఎం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారన్నారు. శనివారమిక్కడ జీహెచ్‌ఎంసీ పరిధిలోని రామచంద్రాపురం డివిజన్ ఎంఐజీ కాలనీలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీటి సమస్య అన్ని చోట్ల ఉందన్నారు. సింగూరు, మంజీర జలాశయాలు పూర్తిగా ఎండిపోవడంతో నగరంలో నీటి ఎద్దడి నెలకొందని, దీనిని అధిగమించేందుకే సీఎం కేసీఆర్.. గోదావరి జలాలను నగరానికి తీసుకొచ్చారని పేర్కొన్నారు.
24 గంటలపాటు తాగునీరు అందించేలా కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారన్నారు. కాగా, కేటీఆర్‌ను డైనమిక్ మినిస్టర్‌గా అభివర్ణించారు హరీశ్‌రావు. ఆయన మహానగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారని, అది తప్పక నెరవేరుతుందని చెప్పారు. రామచంద్రాపురం డివిజన్‌లో నీటి సరఫరా పైపుల ఆధునీకరణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధులకు సూచించారు. కార్పొరేటర్ సూచన మేరకు రామచంద్రాపురం డివిజన్‌ను దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సమీక్షలో ఎంపీలు విశ్వేశ్వర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపల్లి సోమిరెడ్డి పాల్గొన్నారు.
‘గ్రేటర్’కు నిరంతర తాగునీరు
Published Sun, May 15 2016 12:25 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement
Advertisement