గ్రేటర్ మనదే! | Cm Kcr Comment on Greater election | Sakshi
Sakshi News home page

గ్రేటర్ మనదే!

Published Mon, Jan 4 2016 3:44 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

గ్రేటర్ మనదే! - Sakshi

గ్రేటర్ మనదే!

♦ టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష భేటీలో సీఎం కేసీఆర్
♦ జీహెచ్‌ఎంసీలో 80-85 డివిజన్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి
♦ రెండు వారాలు కష్టపడితే 90-95 డివిజన్లు సాధించొచ్చు
♦ సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక
♦ ఒక్కో మంత్రికి ఒక్కో నియోజకవర్గ పర్యవేక్ష ణ బాధ్యత
♦ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచన
♦ ఎవరితోనూ పొత్తు, అవగాహన ఉండదని వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో విజయం తమదేనని, గ్రేటర్‌పై టీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రెండు వారాలపాటు గట్టిగా పనిచేస్తే గ్రేటర్‌లో 90 నుంచి 95 డివిజన్లను సాధించుకోవచ్చని పార్టీ ప్రజా ప్రతినిధులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కొందరు ఎంపీలు పాల్గొన్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల వ్యూహంపైనే సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.

 మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు
 150 డివిజన్లు ఉన్న జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌కు 80 నుంచి 85 డివిజన్లు వస్తాయని సర్వేలన్నీ చెబుతున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. పదిహేను రోజుల పాటు గట్టిగా పనిచేస్తే 90-95 డివిజన్లను తేలిగ్గా గెలుచుకుంటామని నేతలకు సూచించారు. ‘‘నియోజకవర్గాల పర్యవేక్షణ బాధ్యత మంత్రులదే. ఒక్కో డివిజన్‌ను ఒక్కో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీకి కేటాయిస్తాం. ఓపిక ఉంటే ఎంపీలు కూడా డివిజన్ బాధ్యతలు తీసుకోవచ్చు. డివిజన్ ఇన్‌చార్జులు తమకు సహాయకులుగా కనీసం 40 మందిని తెచ్చుకోవాలి. వెయ్యి మంది ఓటర్ల బాధ్యతను ఒక్కో సహాయకుడికి అప్పజెప్పాలి.

ముఖ్యంగా ఇక్కడ ఏ ప్రాంతంలో ఏ జిల్లా వారు ఉన్నారో, ఆ జిల్లా మంత్రే ఆ ప్రాంతంలో ప్రచార బాధ్యతలు తీసుకోవాలి..’’ సీఎం కేసీఆర్ తన ప్రచార వ్యూహాన్ని వివరించారు. పైరవీలకు తావు లేదని, సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తామని.. గెలుపు గుర్రాలకే టికెట్లు దక్కుతాయని స్పష్టం చేసినట్లు తెలిసింది. నారాయణఖేడ్ ఉప ఎన్నికల బాధ్యతతో పాటు, మెదక్ జిల్లా పరిధిలోని పటాన్‌చెరు నియోజకవర్గం కింద ఉన్న మూడు డివిజన్ల బాధ్యతను మంత్రి హరీశ్‌రావు చూసుకుంటారని కేసీఆర్ వెల్లడించినట్లు సమాచారం. ఇక ప్రతి డివిజన్ ఇన్ చార్జి ఏ రోజుకారోజు ఒక గంట సేపు ఆ రోజు జరిగిన ప్రచారంపై సమీక్షించుకోవాలని సూచించారు. బాధ్యతలు స్వీకరించేవారంతా 5వ తేదీ సాయంత్రానికల్లా డివిజన్లకు చేరుకోవాలని... 6వ తేదీ నుంచి ప్రచారంలో పాల్గొనాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచారం కోసం ఎంపీ కవిత అందరికీ అందుబాటులో ఉంటారని చెప్పినట్లు సమాచారం.
 
 ఎమ్మెల్యేలకు మందలింపు
 ‘‘ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, విద్యుత్, నీటి ప్రాజెక్టులను చేపడుతోంది. గొప్పగా ప్రణాళికలు చేశాం. దగ్గరుండి పనులు చేయించుకోవాలని చెప్పాం. సీఎం చేయాలి, ప్రభుత్వమే చేయాలని మడికట్టుకుని కూర్చుంటే ఎలా? సీఈల వరకైనా వెళ్లి దగ్గరుండి పనులు చేయించుకోండి. చేతగాకపోతే చెప్పండి’’ అని కేసీఆర్ ఒకింత ఆగ్రహంగానే ఎమ్మెల్యేలను మందలించారని తెలిసింది. ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సీఎం వారికి సూచించారు.

ఇంటింటికీ నల్లా పథకం గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని.. కానీ ఏప్రిల్ నెలాఖరు నాటికి కొన్ని నియోజకవర్గాలకు ఇంటింటికీ నీళ్లివ్వబోతున్నామని గుర్తుచేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సబ్‌స్టేషన్లు చాలానే మంజూరు చేశామని, ఏప్రిల్ నుంచి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయబోతున్నందున ఎమ్మెల్యేలు గ్రామ స్థాయి నుంచి పర్యవేక్షించాలని ఆదేశించారు. పేదల గృహ నిర్మాణం అంటే ఎలా ఉండాలో దేశానికి ఒక మోడల్‌గా ఐడీహెచ్ కాలనీలో పూర్తిచేసి చూపామని.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డబుల్’ ఇళ్ల పథకం గురించి బాగా ప్రచారం చేయాలని సూచించారు. మనం ఇస్తున్న పెన్షన్లు ప్రజల్లోకి వెళ్లాయని, అడగకుండానే బీడీ కార్మికులకు ఇచ్చిన పెన్షన్లు వరంగల్ ఎన్నికల్లో కీలకమయ్యాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, స్కైవేలు, ఫ్లైఓవర్లు, 24 గంటల విద్యుత్ గురించి జీహెచ్‌ఎంసీలో ప్రచారం చేయాలని, మంచి స్పందన వస్తుందని కేసీఆర్ సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement