అవసరంలేని సందర్భంలోనూ గొప్పలు చెప్పుకోవడం, హామీలను గుప్పించడం, మరునిమిషంలోనే వెంటనే వాటిని మర్చిపోవడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అలవాటే. అందుకే వాగ్ధానాల అమలుదాకా వచ్చేసరికి ఆయన తేలి(కై)పోతారు! ఇటీవల నిర్వహించిన జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లోనూ చంద్రబాబు తనదైన శైలిలో ‘నోబెల్ బహుమతి సాధిస్తే రూ.100 కోట్లు బహుమానం ఇస్తా’నని గప్పాలు కొట్టిన ఆయన.. తన పక్కనే కూర్చున్న నోబెల్ గ్రహీత పట్ల మాత్రం కనీస మర్యాద పాటించలేదు.
‘నోబెల్’ సాధించడమెలాగో చెబుతారా?’ అంటూ ఎవరినైతే టిప్స్ అడిగారో.. ఆ జపాన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత టకాకి కజిటాను అవమానించేలా సీఎం ప్రవర్తించారు. ఇలా చేసినందుకు పలు జాతీయ వార్తా సంస్థలు బాబు తీరును ఎండగట్టగా, సోషల్ మీడియాలోనైతే ‘అయ్యో కజిటా.. చంద్రబాబు ఎంతపని చేశాడు!’ తరహా కామెంట్లు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
(‘నోబెల్’ సాధిస్తే రూ.100 కోట్లు: సీఎం చంద్రబాబు)
శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన 104 నేషనల్ సైన్స్ కాంగ్రెస్ వేడుకల్లో భాగంగా జనవరి 4న చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభోత్సవం జరిగింది. శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ వేదికపై జరిగిన ఆ కార్యక్రమానికి వర్సిటీ ఉపకులపతి దుర్గాభవాని అధ్యక్షత వహించారు. వేదికపై ఏర్పాటుచేసిన కుర్చీల్లో సీఎం చంద్రబాబు, నోబెల్ బహుమతి గ్రహీత టకాకి కజిటా, మరికొందరు శాస్త్రవేత్తలు ఆసీనులయ్యారు. ప్రతిసారిలాగే మైక్ అందుకున్న చాలా సేపటికిగానీ చంద్రబాబు ప్రసంగం పూర్తికాలేదు. ఆ ప్రసంగంలోనే కజిటాను నోబెల్ చిట్కాలు అడిగారు. షెడ్యూల్ ప్రకారం సీఎం ప్రసంగం తర్వాత శాస్త్రవేత్త టకాకి కజిటా విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయాల్సిఉంది. కానీ అలా జరగలేదు.
ప్రసంగం ముగిసిన వెంటనే చంద్రబాబు గబగబా వేదిక నుంచి కిందికి దిగారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయమంత్రి సుజనా చౌదరి సహా అధికారులంతా సీఎంను అనుసరించారు. వేదిక మొత్తం ఖాళీ అవుతోన్న దృశ్యాలను చూసి విద్యార్థులు కూడా బయటికి అడుగులు వేశారు. మాటమాత్రమైనా చెప్పకుండా ఎటువాళ్లు అటు వెళ్లిపోవడంతో సైంటిస్ట్ కజిటా వేదికపై ఒంటరయ్యారు. ఖాళీ అయిన ఆడిటోరియంలో దిక్కులు చూస్తూ కూర్చున్న ఆయనను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు.
దీంతో ఏం చెయ్యాలో పాలుపోని కజిటా.. కాసేపు ల్యాప్‌టాప్‌ను ఓపెన్‌చేసి పరిశీలించారు. ఇంకొన్ని నిమిషాల తర్వాత.. అక్కడి వాలంటీర్లు కజితా దగ్గరికి మాట్లాడారు. బహుమతి ప్రదానాల కార్యక్రమం రద్దయిందని వాలంటీర్ల ద్వారా తెలుసుకున్నతర్వాత కజిటా వేదికదిగి వెళ్లిపోయారు. ఆ విధంగా శాస్త్ర, సాంకేత శాఖ, చంద్రబాబు చేతుల్లో బుక్కయ్యారు!
(వంద కోట్లు సరే.. సదుపాయాలేవీ!: యువశాస్త్రవేత్తల పెదవివిరుపు)
అయ్యో కజిటా! చంద్రబాబు ఎంతపని చేశాడు..
Published Sat, Jan 7 2017 2:00 PM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM
Advertisement
Advertisement