ఖైదీల ఘర్షణ: 60 మంది మృతి
బ్రెజిల్ లోని ఓ జైలులో ఆదివారం ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 60 మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మనాస్ లోని అమెజాన్ జంగిల్ నగరంలో గల జైలులో రెండు డ్రగ్ గ్యాంగ్ ల మధ్య రేగిన వాగ్వాదమే ఇందుకు కారణమని తెలిసింది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అమెజాన్ భద్రతా అధికారి చెప్పారు.
ఆదివారం అర్ధరాత్రి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగారని తెలిపారు. కొందరు ప్రత్యర్ధులను చంపిన తర్వాత వారి శవాలను జైలు గోడ అవతలికి విసిరేశారని చెప్పారు. మరికొందరు జైల్లో నుంచి తప్పించుకుపోయారని వెల్లడించారు. సోమవారం తెల్లవారుజాము సమయానికి జైల్లో అతికష్టం మీద శాంతియుత వాతావరణం నెలకొల్పినట్లు తెలిపారు.
అయితే, బ్రెజిల్ జైళ్ల విధానాన్ని పలు అంతర్జాతీయ సంస్ధలు విమర్శిస్తూ వస్తున్నాయి. బ్రెజిల్ జైళ్లలో ఖైదీలు కిక్కిరిసి ఉంటారు. దీంతో తరచుగా అక్కడి జైళ్లలో గొడవలు జరుగుతుంటాయి.