డ్రగ్స్తో పట్టుబడ్డ ఎలుక
బ్రెజిల్ : ఇప్పటివరకు డ్రగ్స్ను మనుషులు తరలించడం గురించి విన్నాం. కానీ ఇక్కడ ఓ చిట్టెలుక ఆ బాధ్యతను తలకెత్తుకుంది. కొకైన్, గంజాయి వంటి డ్రగ్స్ను తరలిస్తూ సీసీ టీవీలో పోలీసు అధికారుల కంట పడింది. దాంతో పోలీసులు 'ఔరా మూషికా..!' అంటూ నోరెళ్లబెట్టారు. ఈ సంఘటన బ్రెజిల్లోని అరజ్వైనా పట్టణంలోని బర్రా డా గ్రోటా జైలులో చోటుచేసుకుంది. ఖైదీలు ఒక వింగ్ నుంచి మరో వింగ్కు ఈ ఎలుక సాయంతో డ్రగ్స్ను కొరియర్ చేస్తున్నారు.
ఎలుక తోకకు ఓ తాడును కట్టి .. ఆ తాడుకి డ్రగ్స్ ప్యాకెట్ను కడుతున్నారు. ఆ ఎలుక దాన్ని చేర్చాల్సిన చోటుకి చేర్చుతుంది. ఇదంతా గత శుక్రవారం సీసీ టీవీలో గమనించిన జైలు అధికారులు విస్తుపోయారు. వెంటనే వారు ఖైదీల వద్ద తనిఖీలు జరిపి 30 ప్యాకెట్ల గంజాయి, 20 ప్యాకెట్ల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు.