కేజ్రీవాల్ సర్కారుకు చుక్కెదురు
అధికారాల విషయమైఢిల్లీ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవ ర్నర్ నజీబ్ జంగ్ కు మధ్య జరుగుతున్న పోరులో కేజ్రీవాల్ సర్కారుకు గురువారం ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ రాజధాని ప్రాంతానికి అడ్మినిస్ట్రేటి వ్ అధిపతి లెఫ్టినెంట్ గవర్నరే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. లెప్టినెంట్ గవర్నర్ తమ మంత్రి మండలి సలహా మేరకు వ్యవహరించాలని ఆప్ సర్కారు చేస్తున్న వాదనలో పస లేదని పేర్కొంది. 293, 293 ఏఏ అధికరణం ప్రకారం ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమని, భూమి, రవాణా, శాంతిభద్రతల విషయంలో కేంద్రం మాట చెల్లుతుందని న్యాయస్థానం తెలిపింది. లెప్టినెంట్ గ వర్నర్ అనుమతి లేకుండా ఢిల్లీ ప్రభుత్వం ఏ చట్టం చేయలేదని న్యాయస్థానం పేర్కొంది. ఢిల్లీలో అధికారుల నియామకానికి సంబంధించి లెప్టినెంట్ గవర్నర్‌కు సంపూర్ణ అధికారాలను ఇస్తూ కేంద్రం మే21, 2015న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జి. రోహిణి, న్యాయమూర్తి జయంత్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. రెండవ సారి అధికారంలోకి వచ్చాక ఆప్ సర్కారు జారీ చేసిన అనేక నోటిఫికేషన్లను కూడా కోర్టు కొట్టివేసింది. ఢిల్లీ సర్కారు ఈ నోటీిఫికేషన్లను లెప్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా జారీ చేసినందువల్ల అవి చెల్లవని న్యాయస్థానం అభిప్రాయపడింది.
రాజ్యాంగంలోని 239 అధికరణం, 239ఏఏ అధికరణాలను న్యాయమూర్తులు ఉటంకిస్తూ ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమేనని, ఎల్జీ దానికి పాలనాధిపతి అని న్యాయస్థానం పేర్కొంది.అసెంబ్లీ కి ప్రత్యేక హోదా కల్పించినప్పటికీ ఢిల్లీకి కేంద్ర పాలిత ప్రాంతం హోదా కొనసాగుతుందని స్పష్టంచేశారు.చట్టాల రూపకల్పనకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ కేబినెట్ సలహా మేరకు వ్యవరించాలన్న ఆప్ సర్కారు వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. లెప్టినెంట్ గవర్నర్ ముందస్తు అనుమతి తరువాతనే ప్రభుత్వం చట్టాలను రూపొందించాలని న్యాయస్థానం పేర్కొంది.